కోర్టు కేసులో ఉన్న తన భూమిని తనకు తెలియకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడాన్ని నిరసిస్తూ... ఓ మహిళ తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో సర్వే నెంబర్ 345లో తన పేరుతో ఉన్న 1ఎకరం 38 గుంటల భూమిపై కోర్టులో కేసు నడుస్తుండగా... తనకు తెలియకుండా ఇతరులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ తహసీల్దార్‌ను బాధితురాలు సృజన నిలదీసింది.
తహసీల్దార్ కార్యాలయంలో మహిళ ఆత్మహత్యాయత్నం
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. కోర్టులో కేసు నడుస్తుండగా... తన పేరు మీద ఉన్న భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగింది. చివరికి పోలీసులు రంగంలోకి దిగి... ఇరువర్గాలు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని సూచించగా గొడవ సద్ధుమణిగింది.
గత కొన్ని నెలల నుండి పట్టా పుస్తకాల గురించి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు వంశపారంపర్యంగా వచ్చిన భూమిని కొందరు వ్యక్తులు... కోర్టులో కేసు నడుస్తుండగా ఇతరులకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తన పేరుతో ఉన్న భూమి ప్రస్తుతం ఇతరుల పేరుతో ధరణిలో చూపిస్తోందన్నారు. అధికారులిచ్చిన సమాధానంతో నిరాశ చెందిన సృజన... ఒంటిపై సానిటైజర్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని మహిళను సముదాయించి ఇంటికి పంపించారు.
ఈ ఘటనపై యాదగిరిగుట్ట తహసీల్దార్ అశోక్ రెడ్డి స్పందిస్తూ.... భూమి వివాదంపై కోర్టు నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. భూమికి సంబందించిన వ్యక్తులు ధరణిలో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కొరకు వచ్చారన్నారు. కోర్టు ఆదేశాలు లేవు కాబట్టే... ధరణి ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. భూమి వివాదంలో ఉందని తన దృష్టికి రాగానే... కొనుగోలుదారులకు సమాచారం ఇచ్చామన్నారు. భూమి రిజిస్ట్రేషన్ అవుతుందని తెలుసుకున్న సృజన అనే మహిళ తమ వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగిందని తెలిపారు. భూమికి సంబంధించిన ఇరువర్గాల వారు మాట్లాడుకుని వారం రోజుల గడువు కోరారని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.