భువనగిరి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. జిల్లాలో ఈసారి పట్టణ ఓటర్లు ఈసారి ఆసక్తి చూపలేదు. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గినట్లుగా అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల పోలింగ్ సమయం ముగిసినప్పటికీ క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.
ఓటేసిన ప్రముఖులు..
భువనగిరిలోని పాత గుండ్లపల్లిలో సీపీఐ ఎంపీ అభ్యర్థి గోదా శ్రీరాములు ఓటింగ్‌లో పాల్గొన్నారు. సూర్యాపేటలోని రాయిని గూడెం 27వ పోలింగ్ కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, నల్గొండ సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జునసాగర్‌లో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి సతీ సమేతంగా ఓటు వేశారు. 90వ పోలింగ్ కేంద్రంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ అనితా రామచంద్రన్ ఓటు వేశారు. సూర్యాపేట 64వ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ అమోయ్ కుమార్ సతీ సమేతంగా క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84వ పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి ఆర్ దామోదర్‌రెడ్డి ఓటు వేశారు.
కేంద్రాల్లో పర్యటించిన నేతలు
జిల్లాలోని పలు కేంద్రాల్లో పార్టీ నేతలు పర్యటించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. సూర్యాపేటలో తెరాస ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పర్యటించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరిశీలించారు. తిరుమలగిరిలో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. పోలింగ్ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.