యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి. కానీ మండల స్థాయి ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు. ఎక్కడ చూసినా చెత్త, చెదారం. ఇవి చాలవన్నట్లు రాత్రి పూట ప్రమాదాల బారిన పడినా, అత్యవసర చికిత్స కోసం వచ్చిన వారికి చికిత్స చేసేందుకు అక్కడ వైద్యులు ఉండరు. దీనికి ప్రధాన కారణం వైద్యులు, సిబ్బంది కొరత ఉండటమే. ఓపీ సేవలు మధ్యాహ్నం వరకు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల దూరం నుంచి వచ్చిన వారు చూపించుకోకుండానే వెళ్లిపోవాల్సి వస్తోందని చెబుతున్నారు.
గర్భిణీ స్త్రీలు వస్తే అంతే పరిస్థితి..
ఆపద సమయంలో రక్తం అవసరమైతే రోగులు హైదరాబాద్ నుంచి తెప్పించుకోవల్సిందే. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినప్పటికీ... అది రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వైద్యానికి సంబంధించి రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు, ఎక్స్‌రే తీయించు పోవాలంటే పెద్ద ప్రహసనమే. ప్రస్తుతం ఎక్స్ రే తీయడానికి ఒక్కరే ఆపరేటర్ ఉన్నారు. రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేసే పారా మెడికల్ సిబ్బంది రాత్రి వేళలో అందుబాటులో ఉండరు. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రసవవేదనతో వస్తే... స్కానింగ్‌ల కోసం ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిందే.