యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవపురంలో వాగ్గేయకారుడు, కవి ఎర్ర ఉపాలి ప్రథమ వర్ధంతి సభలో పలువురు కళాకారులు, నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల స్వరాన్ని తన పాటలతో వినిపించి.. బడుగు వర్గాలను చైతన్యపరిచిన కవి, గాయకుడు ఎర్ర ఉపాలి అని ఏపూరి సోమన్న అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను విస్మరించిందని.. ఉద్యమ సమయంలో వాడుకొని.. అధికారం రాగానే పక్కకు పెట్టిందని ఆరోపించారు.
'తన పాటతో.. ప్రజల్లో చైతన్యం నింపిన ఉపాలి'
అణగారిన వర్గాల ప్రజలను తన పాటల ద్వారా చైతన్యపరిచిన దళిత బహుజన వాగ్గేయకారుడు, కవి ఎర్ర ఉపాలి అని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవపురంలో ఎర్ర ఉపాలి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్థూపావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉపాలి కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.
నిస్వార్థంగా పని చేస్తూ.. జీవితాన్నంతా ప్రజలను చైతన్య పరిచేందుకు వెచ్చించిన కళాకారుడు ఎర్ర ఉపాలి అని.. మన ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ఉపాలి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటామని పలువురు నాయకులు, కళాకారులు, రచయితలు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేల్, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీర్ల అయిలయ్య, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు తుంగ కుమార్, కార్పొరేటర్ కొల్లూరు అంజయ్య, బట్టు రామచంద్రయ్య, ఎమ్మార్పీఎస్, పలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.