MLA chirumarthi lingaiah: రేపు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు యాదాద్రి నరసింహుడి క్షేత్రానికి చేరుకున్నాయి. హైదరాబాద్ దగ్గరలోని ఓ రిసార్ట్స్‌లో క్యాంప్‌లో ఉన్న నకిరేకల్ నియోజకవర్గంలోని తెరాసకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చారు. అంతేకాకుండా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఛైర్మన్లు, ఎంపీపీతో పాటు వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానాలయంలోకి వెళ్లారు. దాదాపుగా 100 మందికి పైగా వచ్చిన నేరుగా ప్రధానాలయంలోకి వెళ్లారు.
దర్శనాలు నిలిపివేయడంపై భక్తుల ఆగ్రహం
ఈ సమయంలో దర్శనాలను నిలిపివేయటంపై సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైన స్వామివారి ప్రధాన ఆలయంలోకి వైటీడీఏ, వీవీఐపీలకు తప్ప మరెవ్వరికి అనుమతి లేదు. కానీ చిరుమర్తితో వచ్చిన 100 మంది ప్రధానాలయంలోకి వెళ్లారు. సామాన్య భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వర్తించే రూల్స్ వారికి వర్తించవా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అంతమందితో వచ్చిన చిరుమర్తిని ప్రధాన ఆలయంలోకి ఎలా అనుమతిస్తారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులకు ఓ రూల్.. వారికి మరో రూలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.