Gold Donation for Yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ దేవాలయ విమాన గోపురం బంగారు తాపడానికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు నగదు రూపంలో.. మరికొందరు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. హెటిరో డ్రగ్స్, హానర్ ల్యాబ్స్ వేర్వేరుగా రూ.2.50 కోట్ల విరాళం అందించారు. మంత్రి సత్యవతి రాఠోడ్ 12 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు.
ఉడుత భక్తితో ఒంటిపై నగలు
Yadadri donations : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ దర్శించుకున్నారు. ప్రధాన ఆలయాన్ని సందర్శించారు. మరో రెండు నెలల్లో పునఃప్రారంభం కాబోతున్న యాదాద్రి ఆలయం... సీఎం కేసీఆర్ దృఢసంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మరింత పట్టుదలతో పనిచేసేలా సీఎం కేసీఆర్కు శక్తినివ్వాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు. విమాన గోపురానికి విరాళాల సేకరణ జరుగుతోందని, తాను కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఒంటిపై ఉన్న సుమారు 12 తులాల బంగారు నగలను విరాళంగా ఇచ్చారు.
'రాష్ట్రప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2022 ప్రజలకు కలిసిరావాలని శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థించాను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకున్నాను. కలలో కూడా ఊహించని విధంగా... ఈ అద్భుతం కట్టడం సృష్టించిన సీఎం కేసీఆర్కు మరింత శక్తిని ఇవ్వాలని ఆ స్వామివారిని ప్రార్థించాను. ఒకప్పుడు యాదగిరి గుట్ట... ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు వేల మంది భక్తులు వస్తున్నారు. రూ.1200 కోట్లతో వేగంగా ఆలాయన్ని అభివృద్ధి చేశారు. ఉగాదితో పాటు మొదటి పండగగా ఆలయ పున:ప్రారంభం జరగనుండడం సంతోషకరం.'