యాదాద్రి భువనగిరి జిల్లాలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్కూల్ పిల్లలకు నోట్ బుక్, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రైయిని కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు.
యాదగిరిగుట్టలో..
యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ ఛైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ చీర శ్రీశైలం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, వివిధ పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ అధ్యక్షులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ప్రాంగణంలో యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. తహశీల్ధార్ కార్యాలయం వద్ద ఎమ్మార్వో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఇవీ చూడండి: స్వాతంత్య్ర వేడుకల్లో జెండావిష్కరించిన మంత్రి ఈటల