ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి(rains in telangana) యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కేంద్రం జలమయమైంది. పలు కాలనీల్లోని అంతర్గత రోడ్లపై నుంచి వరద నీరు పారుతోంది. స్థానిక చెరువు పూర్తిగా నిండి అలుగు పోయడంతో ఆ ప్రవాహానికి జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు నిండిపోయింది. సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న వ్యాపార సంస్థల్లోకి, లోతట్టు కాలనీల్లోకి నీరు చేరింది.
జలదిగ్బంధం
గాంధీ పార్క్‌లో 5 అడుగుల లోతు మేర నీరుతో నిండి పోయింది. మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయం, పాల శీతలీకరణ కేంద్రం, తితిదే కల్యాణ మండపంలోకి వర్షం నీరు చేరింది. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడుతోందని... ప్రభుత్వ కార్యాలయాలను మరో చోట నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారీ హడావిడి చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు తర్వాత ఈ సమస్య గురించే పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బేకరీ దుకాణం మాది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఒక్కసారిగా నీళ్లు వచ్చాయి. పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాటర్ వచ్చి షాపు మొత్తం మునిగిపోయింది. పోయిన ఏడాది, ఇప్పుడు సేమ్ పరిస్థితి. దీనిని పట్టించుకునే నాథుడే లేరు. ఒకవైపు కరోనా... మరోవైపు వరదల వల్ల నష్టం మీద నష్టం వస్తోంది. అధికారులు మరమ్మతులు చేపట్టి... మాకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.