YADADRI TEMPLE: వరుసగా సెలవులు రావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. నారసింహుని దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. లడ్డూ కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. కొండకింద పుష్కరిణి, కల్యాణ కట్ట, జనాలతో నిండిపోయింది. స్వామి వారికి నిర్వహించే నిత్య పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి నిత్యాదాయం రూ.21లక్షలకు పైగా సమకూరినట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు.
స్వామి వారి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తిప్పలు తప్పడం లేదు...ఒకవైపు రద్దీ మరోవైపు ఎండ వేడితో క్యూలైన్లలో భక్తులు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎస్కలేటర్ వినియోగంలోకి రాకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. కనీసం నిలువనీడ లేదని.. తాగేందుకు మంచినీళ్లు లభించడం లేదని గోడు వెల్లబోసుకుంటున్నారు. భక్తులు అధికంగా రావడంతో బస్సుల వద్ద తోపులాట కొనసాగింది. పార్కింగ్ ప్రాంతానికి దూరంగా బస్‌స్టాప్ ఉండటంతో భక్తులు అసౌకర్యానికి లోనయ్యారు.