కనీవినీ ఎరుగని రీతిలో దారుణ హత్యకు గురైన హాజీపూర్ విద్యార్థినుల కేసుల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దుర్ఘటన జరిగి పది రోజులు గడువగా మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు గ్రామ పరిసరాల్లో ఇంకా తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరోవైపు నిందితుణ్ని తమ కస్టడీలోకి తీసుకునేందుకు... సోమవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నారు. ముగ్గురు విద్యార్థినుల చావులకు కారణమైన సైకోపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పాత జిల్లాల పరిధిలోని ప్రత్యేక న్యాయస్థానాల్లోనే పోక్సో కేసులు విచారణ చేపట్టాల్సి ఉంటుంది. నిందితుడి కస్టడీ పిటిషన్ విషయంలో రాచకొండ కమిషనరేట్ పోలీసులు... నల్గొండలోని మొదటి అదనపు జిల్లా జడ్జి న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నారు.
వచ్చేవారం కస్టడీ పిటిషన్
నిందితుణ్ని కస్టడీకి తీసుకునే విషయంలో పోలీసులు శనివారం నాడే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి వరంగల్ కారాగారంలో ఉన్నందున అది సాధ్యపడలేదు. నిందితుణ్ని కస్టడీకి తీసుకునే విషయంలో ముందుగా నిందితుడికి లేదా ఆయన తరఫు న్యాయవాదికి పోలీసులు నోటీసులు ఇవ్వాలి. శ్రీనివాస్ రెడ్డి విషయంలో కేసును విచారించే న్యాయవాదుల విషయం ఖరారు కానందున నోటీసులు నిందితుడికే నేరుగా ఇవ్వాల్సి ఉంటుంది. వరంగల్ కారాగారంలో ఉన్న సైకోను నోటీసులు ఇచ్చాకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. వరంగల్‌కు వెళ్లే ఇబ్బంది తప్పాలంటే శ్రీనివాస్ రెడ్డిని నల్గొండ కారాగారానికి తరలించాలి. అలా జరగాలంటే శ్రీనివాస్ రెడ్డికి నోటీసులిచ్చాకే... మిగతా ప్రక్రియకు ముందడుగు పడనుంది.