తెలంగాణ

telangana

ETV Bharat / state

హాజీపూర్​ వరుస హత్యలపై నేడు మరోమారు విచారణ

హాజీపూర్ బాలికల హత్యల కేసులో... నేడు మరోమారు విచారణ జరగనుంది. రెండు కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలను నిందితునికి చదివి వినిపించడంతోపాటు... శ్రీనివాస్ రెడ్డి తరఫు సాక్షులుగా కోర్టు ఆదేశాల మేరకు అతడి కుటుంబ సభ్యుల్ని హాజరుపరచే అవకాశముంది. మొత్తం మూడు కేసులకు గాను ఒక కేసులో వాంగ్మూలాల ప్రక్రియ పూర్తి కాగా... మిగతా రెండింట్లో నేడు విచారణ సాగనుంది.

hajipur case enquiry today
హాజీపూర్​ వరుస హత్యలపై నేడు మరోమారు విచారణ

By

Published : Jan 3, 2020, 7:31 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ బాలికల వరుస హత్యల కేసుల్లో... నిందితుణ్ని నేడు మరోమారు న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. మైనర్ల హత్యాచారాలపై... నల్గొండలోని మొదటి అదనపు సెషన్స్ కోర్టులో భాగమైన పోక్సో చట్టం న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. విద్యార్థినుల దారుణ హత్యల కేసుల్లో 101 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్ని... నిందితుడికి చదివి వినిపించే ప్రక్రియ కొనసాగుతోంది.

శ్రీనివాస్​రెడ్డి కుటుంబసభ్యులు కోర్టుకు హాజరయ్యే అవకాశం

ఒక విద్యార్థి హత్యాచారం కేసులో గత డిసెంబరు 26న 44 మంది వాంగ్మూలాల ప్రక్రియ పూర్తి కాగా... మరో ఇద్దరి బాలికల కేసుల్లో నేడు విచారణ జరగనుంది. సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాల్ని... నిందితునికి వినిపించి అభిప్రాయాన్ని నమోదు చేస్తారు. తనకు ఏ పాపం తెలియదని, హత్య కేసులతో తనకెలాంటి ప్రమేయం లేదని చెప్పిన నిందితుడు... పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని న్యాయమూర్తి ఎదుట వాపోయాడు. నీ తరఫున సాక్షులున్నారా అని నిందితుణ్ని ప్రశ్నించగా... తన కుటుంబ సభ్యుల్నే సాక్షులుగా తీసుకువస్తానని జడ్జికి తెలియజేశాడు. దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇవాళ... శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యుల్ని హాజరుపరచే అవకాశముంది.


గతేడాది మార్చి 9న ఓ బాలిక కనిపించకుండా పోగా... ఏప్రిల్ 25న మరో బాలిక అదృశ్యమైంది. మరుసటి రోజు ఏప్రిల్ 26న హాజీపూర్ శివారులోని బావిలో... మృతదేహం కనిపించింది. అదే రోజు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా... మరో ఇద్దరి బాలికల కేసులు వెలుగుచూశాయి. సంచలనం సృష్టించిన ఈ మూడు ఘటనలు మైనర్లవే కావడంతో... రాచకొండ కమిషనరేట్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఇవీ చూడండి:హాజీపూర్​ హత్యకేసు... విచారణ జనవరి 3కు వాయిదా

ABOUT THE AUTHOR

...view details