తెలంగాణ

telangana

ETV Bharat / state

అదృశ్యమైన బాలిక మృతదేహం గుర్తింపు - బాలిక మృతి

యాదాద్రి జిల్లా హాజీపూర్​లో నిన్న అదృశ్యమైన శ్రావణి గ్రామ శివారులోని బావిలో శవమై కనిపించింది. దుండగులు అత్యాచారం చేసి హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వైపు బాలికను వెతకటంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆమె కుటుంబ సభ్యులు  ఘటనా స్థలంలో ఆందోళన చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బాలిక మృతి

By

Published : Apr 27, 2019, 12:00 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్​లో నిన్న అదృశ్యమైన శ్రావణి మృతదేహం గ్రామ శివారులోని బావిలో లభ్యమైంది. వ్యవసాయ క్షేత్రంలోని బావిలో బాలిక పుస్తకాల సంచిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు డాగ్​ స్క్వాడ్​, క్లూస్​ టీంతో గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు వెనుదిరిగిన అనంతరం అక్కడ యువకులు వెతకగా సమీప బావిలో బాలిక మృతదేహం గుర్తించారు.

శ్రావణి మృతదేహాన్ని బావిలో గుర్తించిన పోలీసులు

హత్యగా అనుమానం

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రావణిని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసుంటారని అనుమానిస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

కుటుంబ సభ్యుల ఆందోళన

తమ బిడ్డను వెతకటంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఘటనా స్థలంలోనే ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ, ఏసీపీ వాహనాలపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యుల నిరసనతో మృతదేహం దొరికిన ప్రాంతంలో గందరగోళం నెలకొంది.

ఇదీ జరిగింది

మేడ్చల్​ జిల్లా కీసరలో నిన్న ప్రత్యేక తరగతులకు హాజరైన శ్రావణి ఇంటికి తిరిగి రాలేదు. దీనిపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతుండగా ఇవాళ ఆమె గ్రామ శివారులోని బావిలో శవమై కనిపించింది. పటిష్ఠ బందోబస్తు మధ్య శ్రావణి మృతదేహాన్ని వెలికితీశారు.

ఇదీ చదవండి : కుటుంబ కలహాలతో ఖమ్మంలో వ్యక్తి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details