Negligence of Revenue and Forest Departments: పోడుభూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. రెవెన్యూశాఖ గతంలో పేదలకు అందజేసిన ఎసైన్డ్, వివిధ ప్రాజెక్టుల కోసం బదలాయించిన అటవీభూములకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూశాఖ ఇచ్చిన భూముల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ పట్టాల పేరుతో 1.09 లక్షల ఎకరాల అటవీభూమి ఆక్రమణల్లో ఉందని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రెవెన్యూ, అటవీశాఖల నిర్లక్ష్యం కారణంగా సమస్య జటిలమవుతోంది.
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డతండాలో పరిహారంగా అటవీశాఖకు ఇచ్చిన భూముల్లో పెంచుతున్న మొక్కలు. ఈ భూముల్లో తాము గతంలో సాగుచేసుకున్నామని స్థానికులు చెబుతున్నారు.
అత్యధికం ఈ జిల్లాల్లోనే
రాష్ట్రవ్యాప్తంగా 7.37 లక్షల ఎకరాల అటవీభూమి ఆక్రమణకు గురైనట్లు ఇటీవల ఆ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అందులో 1,09,585 ఎకరాల భూమికి రెవెన్యూశాఖ పట్టాలిచ్చినట్లుగా పేర్కొంది. ‘పేదలకు నాలుగైదు దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూములిచ్చారు. రెవెన్యూశాఖ పట్టాలిచ్చినా ఆ భూములు ఎక్కడున్నదీ చూపించలేదు. సర్వే నంబర్లలో ఉన్న భూమి కంటే ఎక్కువ పట్టాలిచ్చారు. దీంతో కొందరు పక్కనే ఉన్న అటవీభూముల్లో సాగుచేసుకుంటూ వచ్చారు’ అని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వీటిలో కొన్ని అటవీభూములా? రెవెన్యూభూములా? అన్న వివాదమూ ఉంది. రెవెన్యూశాఖ ద్వారా పట్టాలు పొంది సాగు చేస్తున్నట్లు అటవీశాఖ చెబుతున్న వాటిలో అత్యధికంగా- ఆసిఫాబాద్‌లో 15,662, ఆదిలాబాద్‌లో 11,842, మెదక్‌లో 11,724, మంచిర్యాలలో 10,787, నాగర్‌కర్నూల్‌లో 9,661, కామారెడ్డిలో 8,908 ఎకరాల భూములున్నాయి.
తమ భూములే అంటూ..
దామరచర్ల విద్యుత్తు ప్రాజెక్టు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా అటవీభూములు తీసుకున్నారు. పరిహారంగా రెవెన్యూశాఖ తరఫున పలుచోట్ల ప్రభుత్వభూముల్ని అటవీశాఖకు ఇచ్చారు. అక్కడ మొక్కలు నాటేందుకు, వాటి సంరక్షణకు, ప్రత్యామ్నాయ అటవీకరణకు సంబంధిత శాఖ నిధులిస్తోంది. ఆ భూముల చుట్టూ కంచె వేసి అటవీశాఖ మొక్కలు నాటింది. పోడు దరఖాస్తుల ప్రక్రియ మొదలైన క్రమంలో గతంలో తాము అక్కడ సాగు చేసుకున్నామని, ఆ భూములకు పట్టాలివ్వాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. అదే విషయాన్ని యాదాద్రి జిల్లా పొర్లగడ్డతండా వాసులు మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు అటవీశాఖ మంగళవారం అక్కడ గ్రామసభ నిర్వహించింది. తాజా పరిణామాలు, వివాదాలపై అటవీశాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది.మరోవంక.. రెవెన్యూశాఖ ప్రభుత్వ భూముల్లో ఇచ్చిన పట్టాలతో తమ భూముల్ని ఆక్రమించి సాగు చేస్తున్నారని చెబుతున్న అటవీశాఖ.. ఆక్రమణల సమయంలోనే వాటిని అడ్డుకోకుండా నిర్లక్ష్యం చేయటం గమనార్హం.
ఇదీ చూడండి:Yasangi Cultivation in Palamuru: యాసంగి సాగు గందరగోళం.. గణనీయంగా తగ్గిన పంట విస్తీర్ణం