పాత వస్తువులను తక్కువ ధరలకు అమ్మేస్తామంటూ అంతర్జాలం ద్వారా జేబులకు కన్నాలేసేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లను ప్రధాన అడ్డాగా ఎంచుకున్నారు కేటుగాళ్ల. తక్కువ ధర అనగానే ఇంకేముంది వెనకా ముందు ఆలోచించకుండా వారు కోరినంత వారి ఖాతాలో వేసి వస్తువుకోసం ఎదురు చూస్తూ... తీరా ఫోన్ పనిచేయనప్పుడు తెలుస్తుంది మోసపోయామని. ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో సైబర్ క్రైం నేరగాళ్లు బుల్లెట్ ఆశచూపి ఓ వ్యక్తి నుంచి నగదు కాజేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
బుల్లెట్ ఆశ చూపించి..65వేలు కొట్టేశారు - ఓఎల్ఎక్స్లో రూ.65వేలు మోసం
కొన్ని సైబర్ నేరాలను పరిశీలిస్తే ఇంత సులువుగా కేటుగాళ్ల బుట్టలో పడిపోతారా అనిపిస్తుంటుంది. నిత్యం ఎన్నో ఘటనలు చూస్తున్నా ఎంతలా అవగాహన కల్పిస్తున్నా కాస్త ఆకర్షణగా ప్రకటన కనపడగానే బుక్కవుతున్నారు. మోసపోయామని తెలుసుకుని చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే..
భువనగిరి పురపాలక పరిధిలోని బొమ్మాయిపల్లికి చెందిన రాజేష్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఇటీవల ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో తక్కువ ధరకు బుల్లెట్ ద్విచక్ర వాహనం విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు మాజీ సైనికుడు పేరుతో ఉన్న ఓ ప్రకటన చూశాడు. వాహనం తక్కువ ధరకి లభిస్తుందని, ప్రకటనలో ఉన్న సదరు వ్యక్తిని ఫోన్‌ద్వారా సంప్రదించాడు. నగదు పంపించిన తర్వాత వాహనం ఇస్తానని చెప్పడం వల్ల రూ.65వేలు ఫోన్‌పే ద్వారా సదరు వ్యక్తి నంబర్‌కు పంపాడు. నగదు అందాక ఆ నంబరు పనిచేయలేదు. తాను మోసపోయానని గ్రహించి బాధితుడు హైదరాబాద్‌లోని సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.