కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పలు గ్రామాలు, పట్టణాలు స్వచ్ఛంద లాక్డౌన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో వైరస్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతుండడం వల్ల వ్యాపారులు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. యాదగిరిగుట్టలో అత్యవసర సేవలు తప్ప మిగతా దుకాణాలన్నీ మూసివేయాలని పురపాలక సంఘం తీర్మానించింది. రాత్రి కర్ఫ్యూ కొనసాగుతున్న కారణంగా యాదాద్రి ఆలయాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సేవలు కొనసాగుతున్నాయి.
రహదారులు నిర్మానుష్యం
యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం కరోనా నిర్ధరణ పరీక్షలు జరపగా పట్టణంలో 14, మోటకొండూర్ 6, తుర్కపల్లి 14, రాజాపేట 7, ఆలేరు 31, బొమ్మలరామారం 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల నుంచి పట్టణంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి రహదారులు నిర్మానుష్యంగా మారాయి.