ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. బాలాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
యాదాద్రి ప్రగతిని పరిశీలించిన సీఎం... అధికారులకు సూచనలు నిబంధనలు పాటిస్తూ..
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ ఆలయ ద్వారం బయట నుంచే దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం పండితులు చతుర్వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను సీఎంకు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
పరిశీలిస్తూ..
స్వామివారి దర్శనం తర్వాత క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని సీఎంకు అధికారులు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తోన్న ఆరు వరుసల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఘాట్ రోడ్డులో మొక్కల పెంపకం పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తగు సూచనలు చేస్తూ..
ఇటీవల మహాబలిపురం నుంచి తెప్పించిన విగ్రహాల అమరిక పనులను సీఎం పరిశీలించారు. దర్శన సముదాయం, ప్రసాద కాంప్లెక్స్... శివాలయం, పుష్కరిణి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయానికి నలుదిక్కులా కృష్ణశిల రాతి విగ్రహాలు... సింహం, ఐరావతం, శంకు చక్రాలు, గరుత్మంతుని విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయం దివ్య విమాన రాజగోపురానికి స్వర్ణకాంతులు... ఆలయ నగరి, వీవీఐపీ వసతి కోసం ప్రెసిడెన్షియల్ సూట్స్, విల్లాల నిర్మాణాలను పరిశీలించారు. ఈ పనులన్నింటినీ ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ఇదీ చూడండి:నాణ్యతలో రాజీ పడొద్దు: మంత్రి తలసాని