సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా(CJI) బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని(sri lakshmi narasimha swamy) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి చేరుకున్న సీజేఐ దంపతులకు కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతించారు. దర్శనం అనంతరం బాలాలయంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వేదాశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందించారు.
పునర్నిర్మాణ పనుల పరిశీలన
దర్శనం తర్వాత రమణ దంపతులు ఆలయ పునర్మిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధానాలయానికి ఉత్తర దిశలో నిర్మాణ పనులను వీక్షించారు. ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్ పనులు, ఆలయ నగరిని సందర్శించారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఆలయ ఉద్ఘాటన జరగనుంది. ఆలయ నిర్మాణానికి వినియోగించిన కృష్ణ శిలలు, అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్న శిల్పకళా సౌందర్యం మంత్రముగ్ధులను చేసేలా పనులు జరుగుతున్నాయి. వెలుగుజిలుగులు వెదజల్లేలా ప్రత్యేకంగా లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రులు, యాడా అధికారులు సీజేఐ ఎన్వీ రమణకు వివరించారు.