యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతంలో 10 గుట్టలున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రాచకొండ ప్రాంతంలోని గుట్టల్లో జాలువారుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. పల్లగట్టు తండా, కొండమూల తండాల్లో కొండలపై నుంచి 50 అడుగుల ఎత్తులో నుంచి కిందకు జారుతున్న గంగమ్మ గలగలలు బోగత, కుంటాల జలపాతాలను తలపిస్తున్నాయి. నీటి సవ్వడులు వీణులవిందు చేస్తున్నాయి.
ఈ జలపాతాల అందాలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తెల్లని పాలలాంటి నీటిలో కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు. సెల్ఫీలు దిగుతూ... ఆ ప్రకృతి అందాలను బంధిస్తున్నారు. కొందరు అక్కడే వంటలు చేసుకొని ప్రకృతి తల్లి ఒడిలో సేద తీరుతున్నారు. జలపాతం అందాలను చూస్తుంటే... సమయమే తెలియట్లేదని చెబుతున్నారు పర్యటకులు.