Block fungus victim: కరోనా, బ్లాక్ ఫంగస్ ఓ వ్యక్తి జీవితాన్ని అతలాకుతలం చేసింది. అతనితో పాటు కుటుంబ సభ్యులందరికీ సోకింది. వారందరూ కోలుకున్నా.. ఆ వ్యక్తిని మాత్రం కోలుకోలేదని దెబ్బతీసింది. కొవిడ్ కాస్త.. బ్లాక్ ఫంగస్‌గా.. అది కాస్తా మెదడుకు, కళ్లకు సోకింది. దీంతో చూపును కోల్పోయాడు. కుటుంబ పోషణకు దిక్కు లేకుండా పోయింది. దీంతో తమకు సహాయం చేయలంటూ ఆ వ్యక్తి తన భార్యతో కలిసి సోమవారం.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. తన దీనస్థితిని అధికారులకు వివరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన కోటి జనార్దన్ రెడ్డి, సురేఖ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. జనార్దన్ రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఈ మధ్యనే అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. అంతా సంతోషంగా ఉందనుకున్న సమయంలో వారి కుటుంపై కొవిడ్ మహమ్మారి పంజా విసిరింది. ఈ ఏడాది మే నెలలో జనార్దన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులందరూ కొవిడ్ బారిన పడ్డారు. గాంధీలో చికిత్స అనంతరం కుటుంబ సభ్యులందరూ కోలుకున్నారు. కానీ జనార్దన్ రెడ్డికి మాత్రం బ్లాక్ ఫంగస్ సోకింది. మే 11న అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. బ్లాక్ ఫంగస్ మెదడు, కళ్లకు సోకడంతో చూపును కోల్పోయాడు. నోటి పైభాగానికి ఇన్ఫెక్షన్ రావడంతో పైభాగాన్ని వైద్యులు తొలగించారు. మెదడుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రాణాలు దక్కించుకున్నా.. కొవిడ్ మహమ్మారి మిగిల్చిన గాయం ఆ కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది.
కుటుంబానికి పెద్ద దిక్కైన జనార్దన్ రెడ్డి.. ప్రస్తుతం ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాడు. కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో తమ కష్టాలను జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. గతంలో బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కట్టుకున్నామని.. ఇప్పుడు ఇల్లు గడవడమే కష్టంగా ఉందని.. లోన్ వాయిదాలు చెల్లించకపోవడం వల్ల ఇంటిని బ్యాంకు అధికారులు జప్తు చేస్తామంటున్నారని ఆ దంపతులు వాపోతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన తాము.. ఇంటిని కోల్పోతే కుటుంబంతో సహా రోడ్డున పడిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితిని పరిశీలించి ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.