వరంగల్ పట్టణం హన్మకొండలో జిల్లా ప్రభుత్వ అధికారులు పెళ్లి పెద్దలుగా మారి తల్లిదండ్రులు లేని ఓ అమ్మాయికి వివాహం జరిపించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన మహాలక్ష్మికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయి వీధి బాలికగా జీవనం కొనసాగిస్తుండేది. 8 ఏళ్లక్రితం ఆ అమ్మాయి వరంగల్‌కు చేరింది.
'అధికారులే ఆత్మబంధువులు... అనాథ అమ్మాయికి పెళ్లి' సర్వీస్ హోమ్‌లో ఆశ్రయం:
ఆ అమ్మాయిని మహిళా శిశు సంక్షేమ శాఖ వారు చేరదీసి హన్మకొండలోని సర్వీస్ హోమ్‌లో ఆశ్రయం కల్పించారు. మహాలక్ష్మికి ఓపెన్టెన్త్లో పరీక్ష రాయించి టైలరింగ్‌లో శిక్షణనిచ్చారు. ప్రస్తుతం ఆమె వయస్సు 24 సంవత్సరాలు కాగా... ఒక మంచి జీవితాన్ని అందించాలనే ఆలోచనతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు మహాలక్ష్మికి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ముందుకు వచ్చిన ఆదర్శ యువకుడు:
వరంగల్ అర్బన్ జిల్లా పైడిపల్లి గ్రామానికి చెందిన సుంకరి యాకయ్య ఆమె గురించి వివరాలు తెలుసుకుని... మహాలక్ష్మిని వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. యాకయ్య వయస్సు30 సంవత్సరాలు. కొంతకాలం క్రితం అతడి తండ్రి మరణించగా... ప్రస్తుతం అతనికి తల్లి, ఇద్దరు అక్కలున్నారు. అక్కలిద్దరికి పెళ్లి అయింది. అతని కుటుంబ సభ్యులు నిండు మనసుతో ఈ వివాహానికి ఒప్పుకున్నారు. నగరానికి చెందిన వర్తక సంఘం, రైస్ మిల్లర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ జిల్లా అధికారుల సహకారంతో ఇవాళ మహాలక్ష్మి, యాకయ్యల పెళ్లి ఘనంగా జరిగింది. వీరి వివాహానికి జిల్లా ప్రభుత్వ అధికారులతో పాటుగా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుమల దేవి ముఖ్యఅతిథిగా హాజరై ఆశీర్వదించారు.
వాళ్లు యువతకు స్ఫూర్తి:
మాటలు అందరూ చెబుతారు కానీ... వాటిని ఆచరణలో కొందరు మాత్రమే పెడతారని... ఈ ఆదర్శ వివాహానికి ముందుకు వచ్చిన యాకయ్యను అందరూ అభినందించారు. వీరిని చూసి సమాజంలో మిగిలిన యువత కూడా స్పూర్తి పొందాలని పెద్దలు ఆకాంక్షించారు.
ఇదీచూడండి: బిడ్డను అమ్మకానికి పెట్టిన కన్నతల్లి