వరంగల్ అర్బన్ జిల్లాలో 50రోజుల తరువాత ఏసీ, ఆటోమోబైల్ దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. సడలించిన వాటిలో భాగంగా ఎలక్ట్రికల్, గృహ నిర్మాణ సంబంధమైన దుకాణాలూ గత వారంలో తెరుచుకున్నాయి. ఈ దుకాణాలకు వచ్చేవారు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించి దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
మంత్రి సమీక్ష..
వలస కూలీలను స్వస్థలాలకు పంపించేలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొవిడ్ 19 నియంత్రణా చర్యలు... ధాన్యం కొనుగోలు సహా వివిధ అంశాలపై హన్మకొండలో ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇది శుభపరిణామం..
వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పాజిటివ్ వ్యక్తులంతా కోలుకుని... ఆసుపత్రి నుంచి డిశ్చార్చి కావడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. కేసుల సంఖ్య తగ్గినా... ప్రమాదం ఇంకా పొంచే ఉందని... అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్డౌన్ పరిస్థితుల్లోనూ రైతులకు మద్దతు ధర చెల్లించి...ధాన్యం, మక్కలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.