ఆన్లైన్ 'ఇన్స్టంట్ లోన్' యాప్‌లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్‌కుమార్.. ప్రజలకు సూచించారు. ఇటువంటి రుణ యాప్‌లపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నూతనంగా రూపొందించిన సంక్షిప్త ప్రచార వీడియో సందేశాన్ని సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ల ఇన్ఛార్జ్లు, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్కో కలిసి ఆవిష్కరించారు.
అధిక వడ్డీలతో వేధింపులు
ఈ మేరకు రుణ యాప్‌ల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ కమిషనర్ ఓ ప్రకటన చేశారు. సులువుగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో వ్యక్తులు, వ్యాపారస్థులు ఇటువంటి యాప్‌లకు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. తీరా రుణాలు తీసుకున్నాక అధిక వడ్డీ, ఛార్జీల పేరిట యాప్ నిర్వాహకులు రుణ గ్రహీతల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని వివరించారు. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో యాప్ నిర్వాహకులు దారుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ముందుస్తుగా కుదిరిన ఒప్పందాన్ని దుర్వినియోగం చేస్తూ రుణ గ్రహీతల ఫోన్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించుకుంటున్నారని సీపీ వెల్లడించారు.
'ఇది చట్టరీత్యా నేరం. ఇలాంటి చట్టబద్ధత లేని యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద మాత్రమే రుణాలు తీసుకోవాలి. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్, ఆధార్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియజేయకండి. ఇలాంటి వ్యక్తులు, సంస్థల నుంచి అప్రమత్తంగా ఉండాలి.'