వరంగల్ నగరంలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి ఓరుగల్లు మహానగరం తడిసి ముద్దయింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అలమటిస్తున్న నగరవాసులకు తాజాగా కురిసిన వర్షం కాస్తంత ఊరట నిచ్చింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి త్రినగరిలోని రహదారులు జలమయం అయ్యాయి.
rain effect: కుండపోతగా వర్షం.. జల దిగ్బంధంలో ఓరుగల్లు నగరం - Telangana news today
వరంగల్ నగరంలో అర్ధరాత్రి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల డ్రైనేజీ పనులు నిలిచిపోవడం వల్ల వర్షం నీరు రోడ్లపైనే నిలిచిపోతుంది.
ఖిలా వరంగల్, పెరుకవాడ, శివ నగర్, శాంతి నగర్, మైసయ్య నగర్‌తో పాటు పలు కాలనీల్లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. అప్రమత్తమైన మహానగర పాలక పారిశుద్ధ్య సిబ్బంది స్పందించి నిలిచిన మురుగు నీరు సాఫీగా పోయే విధంగా చర్యలు చేపట్టారు. అండర్ డ్రైనేజీ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి ఓరుగల్లు నగరం జల దిగ్బంధంగా మారింది.
ఇదీ చూడండి:RAINS: రాత్రి నుంచి ఎడతెరిపిలేని వాన.. ఇళ్లలోకి వరదనీరు