Rahul Gandhi on TRS, BJP: తెలంగాణలో ఒక వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల సొమ్ము వేల కోట్లు మింగింది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజలను మోసం చేసిన వారితో కాంగ్రెస్‌కు సంబంధం ఉండదని స్పష్టం చేశారు. పొత్తుల గురించి కాంగ్రెస్‌లో ఎవరు మాట్లాడినా బహిష్కరిస్తామని హెచ్చరించారు. తెరాస, భాజపాతో అనుబంధముండే వాళ్లు కాంగ్రెస్‌లో ఉండొద్దని సూచించారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
'వచ్చే ఎన్నికల్లో తెరాస, భాజపాను ఓడిస్తాం. తెరాస, భాజపాతో కాంగ్రెస్ నేరుగా పోరాడుతుంది. తెలంగాణ యువతను మోసం చేసిన వారిని గద్దె దించుతాం. ప్రజల అభిమానం పొందిన వారికే ఈసారి టికెట్లు ఇస్తాం. నిజమైన ప్రజాసేవ ఎవరు చేస్తున్నారో పార్టీ గమనిస్తోంది. ప్రజల మధ్య ఉండని వారికి ఈసారి టికెట్లు దక్కవు. కాంగ్రెస్ విధివిధానాలను విమర్శిస్తే ఊరుకునేది లేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు పిలిచినా వస్తాను. తెరాసపై నా పోరాటం కూడా కొనసాగుతుంది.' - రాహుల్‌గాంధీ