స్పష్టమైన ఆశయం.. అంతే అండగా నిలిచే తల్లిదండ్రులు.. పదునైన వ్యూహాలు నేర్పించే గురువు.. చేతినిండా పతకాలు ఆమె సొంతం. వరంగల్ జిల్లా ఏకశిలానగర్‌లో నివసిస్తున్న సంతోషికి కిక్ బాక్సింగ్ అంటే ప్రాణం.. కిక్ కొడితే పతకం ఖాయం చేసే సత్తా ఉన్నా పేదరికం ఆమె పట్టుదలకు తూట్లు పొడుస్తోంది.
అడుగడుగునా పేదరికం అడ్డు తగులుతున్నా ఈనెల మొదటివారంలో టర్కీలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో వెండి పతకం సొంతం చేసుకుంది.
ఆరో తరగతి నుంచే ఆరంభం
ఆరో తరగతిలో ఉండగా వేసవి శిక్షణ శిబిరంలో యోగా నేర్చుకున్న సంతోషి.. ఆత్మరక్షణ కోసం కరాటే సాధన చేసింది. ఆ తర్వాత గురువుల సూచనలతో కిక్ బాక్సింగ్‌పై దృష్టి సారించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వరుస పతకాలు సొంతం చేసుకుంది. 2015లో కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాయింట్ ఫైట్, లైట్ కాంటాక్ట్ ఫైట్ విభాగాల్లో స్వర్ణ, రజత పతకాలను తన ఖాతాలో వేసుకుని జాతీయ స్థాయికి అర్హత సాధించింది. అదే సంవత్సరం దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పాయింట్ ఫైట్ విభాగంలో కాంస్యం సొంతం చేసుకుంది. గత ఏడాది హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది సంతోషి.