TS GOVT about Regional airports : తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో విమానాల రాకపోకలు ఎప్పుడన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. తుది నివేదిక ఇచ్చే విషయంలో ఎయిర్‌పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) జాప్యం చేస్తున్న నేపథ్యంలో మరోసారి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు నగరాల్లో ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. సాధ్యాసాధ్యాల అధ్యయన బాధ్యతలను ఏఏఐకి అప్పగించింది. ఆదిలాబాద్, వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లు విమానాల రాకపోకలకు అనువైనవేనని ఏఏఐ 2019లో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. తుది నివేదిక ఇవ్వాలని పదేపదే రాష్ట్ర ప్రభుత్వం కోరినా ఏఏఐ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ ఇప్పటికే పలు దఫాలు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో గడిచిన ఏడాదిలో హైదరాబాద్ వచ్చిన ఏఏఐ అధికారులు..గతంలో ఉపయోగించిన రన్‌వేలు ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్‌లలో విమానాల రాకపోకలకు త్వరగా ఏర్పాట్లు చేయవచ్చని స్పష్టంచేశారు.
అయినా అందని తుది నివేదిక
అధికారుల అభిప్రాయాలకు అనుగుణంగా ఆ మూడు ప్రాంతాల్లో రన్‌వేల మరమ్మతులు, ఇతర ఏర్పాట్లకు అయ్యే ఖర్చుపై అంచనా వ్యయాలతో కూడిన తుది నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఏటీఆర్-72, క్యూ-400 వంటివి కాకపోయినా తొలిదశలో అంతకన్నా చిన్న విమానాలు నడిపేందుకు చేపట్టాల్సిన పనులు, అందుకయ్యే వ్యయాలపై నివేదికలివ్వాలని సూచించింది. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతి రాదిత్య సింథియా హైదరాబాద్ వచ్చిన సందర్భంలోనూ ప్రాంతీయ విమానాశ్రయాలకు త్వరితగతిన అనుమతులివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కోరారు. అయినప్పటికీ ఏఏఐ నుంచి ఎలాంటి స్పందన లేదు.