భూముల వ్యవహారంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు... క్రయవిక్రయాలు పారదర్శకంగా నిర్వహించేందుకు.. రెవెన్యూ సేవలు వేగవంతంగా జరిగేందుకు.. సర్కార్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ చట్టం అమల్లోకి రాగానే... వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఇక తహశీల్దార్ కార్యాలయంలోనే జరుగుతాయి. నేరుగా తహశీల్దార్లే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని రెండు మండలాల్లో అమలవుతున్నది. ఈ చట్టం సాధ్యాసాధ్యాలపై రాష్ట్రంలో 21 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద... తహశీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఈ విధానానికి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకూ 3160 రిజిస్ట్రేషన్లు తహశీల్దార్లే చేశారు. మొత్తం మూడు కోట్ల 8 లక్షల 11 వేల రూపాయల ఆదాయం ఖజానాకు సమకూరింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి తహశీల్దార్ కార్యాలయంలోనూ రెండేళ్ల నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. ఇప్పటిదాకా 1150 రిజిస్ట్రేషన్లు కాగా.. 61 లక్షల యాభై వేల రూపాయల ఆదాయం వచ్చింది. తహశీల్దార్ల వద్ద భూమికి సంబంధించిన అన్ని రికార్డులు ఉండడం, భూముల మీద అధికారులకు పక్కా అవగాహన ఉండటం మూలాన ఎలాంటి వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతోంది. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇకపై రిజిస్ట్రేషన్ ఇక్కట్లు తప్పనున్నాయి. భూమి క్రయ విక్రయాల్లో పారదర్శకతతో వివాదాలు.. తగ్గుముఖం పట్టనున్నాయ్.