తెలంగాణ

telangana

ETV Bharat / state

Sculptor: ఔరా... శిల్పాలకు జీవం పోస్తున్న సుందరం!! - Special story on Sculptor Sundaram

తండ్రి కూడుపెట్టదని చెపుతున్నా... వారసత్వంగా వచ్చిన కళను... కష్టమైనా ఇష్టంతో... నేర్చుకున్నాడు. వేల కేజీల బరువైన రాళ్లను చెక్కి... అందమైన శిల్పాలుగా తయారుచేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఈ కళ ద్వారా తను బతకడమే కాకుండా కాకుండా.. పది మందికి ఉపాధి కూడా కలిగించాడు. తాజాగా ఈ శిల్పి తయారుచేస్తున్న హనుమంతుడి భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అసలు ఎవరీ శిల్పి... అతని గురించి తెలుసుకుందాం.

Sculptor
Sculptor

By

Published : Aug 21, 2021, 7:28 AM IST

Sculptor: ఔరా... శిల్పాలకు జీవం పోస్తున్న సుందరం!!

శిలలపై శిల్పాలు చెక్కినారు... మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారూ... అంటూ ఓ సినీ కవి రాసిన మాటలు నాటికీ నేటికీ నిత్యసత్యాలే. అత్యద్భుతమైన శిల్ప కళకు.. భారత దేశం పెట్టింది పేరైతే... ఎందరో రాజులు, చక్రవర్తులు... ఆ శిల్పకళను ప్రోత్సహించారు. వారి ఆస్థానంలోని శిల్పులు.... తమ అద్భుత నైపుణ్యంతో... శిలలను చెక్కి.. సహజంగా కనిపించే విధంగా ప్రతిమలు తయారుచేసి.... ఆ కళకే వన్నె తెచ్చారు.

ఓరుగల్లు శిల్పి సుందరం

ఇక కాకతీయుల కళావైభవం మాటల్లో వర్ణించలేం. రామప్ప శిల్పసోయగాలు.... శతాబ్దాలు దాటినా చెక్కుచెదరదు. రామప్ప లాంటి వారసత్వ సంపద... మనకు వెలకట్టలేని అమూల్య కానుక. రామప్పతో పాటుగా... ఎంతో మంది శిల్పులు... శిల్ప కళకు ప్రాణం పోస్తే.... నేడు ఆ కళనే జీవనాధారంగా చేసుకుని... కనుమరగవ్వకుండా కళను కాపాడుతున్నారు పలువురు ఆధునిక శిల్పులు. అలాంటివారిలో శిల్పి సుందరం కూడా ఒకరు. కఠిన గండశిలకు దైవత్వం తీసుకువచ్చి... చూడగానే భక్తి భావం కలిగి నమస్కరించేలా దేవతా మూర్తులను తయారుచేయడంలో ఇతనికి ఇతనే సాటి.

శిల్పకళపై మక్కువతో...

శిల్పి సుందరం స్వస్థలం తంజావూరు. నాలుగు దశాబ్దాల క్రితం తల్లిదండ్రులతో ఓరుగల్లుకు వచ్చి స్థిరపడ్డారు. శిల్పకళకు ఆదరణ తగ్గడంతో.. వారసత్వంగా వచ్చిన ఈ కళ కూడు పెట్టదని... ఉద్యోగం చూసుకోమని తండ్రి చెప్పినా... వినకుండా పట్టుబట్టి ఇందులో ప్రావీణ్యం సంపాదించాడు. వరంగల్ ములుగు రోడ్డులో శిల్పాలు తయారు చేస్తూ... జీవనం సాగిస్తున్నాడు. శిల్పకళపై మక్కువ కలిగిన వారిని పనిలో పెట్టుకుని... ఉపాధిని చూపెడుతున్నాడు.

శిల్పాలు చెక్కడం అంటే నాకు ఆసక్తి. నేను 5వ తరగతి చదవడం నుంచే నేను నేర్చుకున్న. మా నాన్న గారు నన్ను ఈ పని చేయవద్దని చెప్పారు. అయిన పట్టుదలతో శిల్పాలు చెక్కడం నేర్చుకుని... అందంగా శిల్పాలు తయారు చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేకుండానే ఈ పనిని మేం చేస్తున్నాం. మంచి రాయిని ఎంచుకుని విగ్రహ రూపం తీసుకువస్తాం. అంతకు ముందు ఓ విగ్రహం తయారు చేయాలంటే.. నెలల సమయం పట్టేది. ఇప్పుడు యంత్రాలతో తక్కువ సమయంలోనే తయారు చేస్తున్నాం.

- సుందరం, శిల్పి , వరంగల్ జిల్లా

అద్భుత నైపుణ్యంతో ఔరా

రాముడు కృష్ణుడు, శ్రీనివాసుడు హనుమంతుడు.... ఇలా ఎన్నో దేవతా ప్రతిమలు, మహనీయుల విగ్రహాలు, ఆలయ ధ్వజస్తంభాలు తయారుచేసి... ‍‍సుందరం ఔరా అనిపిస్తూన్నాడు. అద్భుత నైపుణ్యం కనబరచడంతో... ఆర్డర్లూ వెలువెత్తుతున్నాయి. అమెరికాలోని పలు దేవాలయాలకు సైతం.. సుందరం విగ్రహాలు వెళ్లాయి. కొండగట్టు దగ్గర ప్రతిష్టించేందుకు..12 అడుగుల భారీ ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు. సుందరం పనితనానికి మెచ్చి ప్రభుత్వం పలు చోట్ల పనులిచ్చి ప్రోత్సహించింది.

నవగ్రహాల తయారీ

మంచి రాయిని ఎన్నుకోవడం... దానిని విగ్రహ రూపంగా మలచడం... చెప్పినంత సులభం కాదు. అయితే గతంతో పోలిస్తే... ఇప్పుడు అధునాతన పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల విగ్రహ తయారీ పని కొంత మేర సులవైందని సుందరం చెపుతున్నాడు. గ్రహా లక్షణాలు బట్టి... నవగ్రహాలను పలు వర్ణాల రాళ్లతో తయారు చేశాడు శిల్పి సుందరం. త్వరలోనే నిర్మల్ లోని ఓ ఆలయంలో వీటిని ప్రతిష్టించనున్నారు. శిల్పకళకే... చిరునామాగా నిలిచే రామప్ప ఆలయానికి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపురావడం... దేశానికే గర్వకారణమని సుందరం అంటున్నాడు. శతాబ్దాల క్రితమే అత్యద్భుత సాంకేతికతను వాడారని కొనియాడారు. రామప్ప ఆలయం...తమకందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.

ఓరుగల్లులో ఉంటున్నందుకు గర్వపడుతున్నాం. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. రామప్ప శిల్పల్లా తయారు చేయడం కష్టం.. కానీ ప్రయత్నిస్తాం. ఈ పనిలో మంచి భవిష్యత్తు ఉంది. అందరూ నేర్చుకోవాలి.

- సుందరం, శిల్పి , వరంగల్ జిల్లా

ప్రభుత్వం కృషి చేయాలి

శిల్పకళపై మక్కువ కలిగిన దాదాపు 70 మంది... సుందరం దగ్గర పనిచేస్తున్నారు. చూడచక్కని విగ్రహాలను తయారు చేస్తూ... తమ ప్రతిభను చాటుకుంటున్నారు. చాలా మందికి శిల్పకళపై ఆసక్తి ఉన్నా... ఈ విద్యను నేర్పించే కళాశాలలు మన దగ్గర లేవని.... ప్రభుత్వం ఈ దిశగా కృషి చేయాలని కోరుతున్నారు. బలవంతంగా కాకుండా... ఇష్టంతో నేర్చుకుంటేనే.... ఈ పనిలో నైపుణ్యం సాధించగలరని.. ఆసక్తి కలిగిన వారెవరైనా... తన దగ్గర నేర్చుకోవచ్చని అంటారు శిల్పి సుందరం.

ABOUT THE AUTHOR

...view details