తెలంగాణ

telangana

ETV Bharat / state

Ragi Java to Students: ఒక్కరి ఆశయం.. 508 పాఠశాలల విద్యార్థుల ఆకలి తీర్చింది..!

Bellam Ragi Java to Students: ఎండలు మండిపోతున్నాయి. కాసేపు ఎండలో నిల్చుంటే.. కళ్లు తిరిగిపోయే పరిస్థితి నెలకొంటోంది. మరి ఉదయమే.. పాఠశాలలకు వచ్చే పిల్లల పరిస్థితి ప్రత్యేకించి చెప్పనే అక్కరలేదు. అయితే జనగామలో పాఠశాలలకొచ్చే చిన్నారులకు ఆ భయం అక్కరలేదు. పాఠశాలలోనే పోషకాలతో నిండిన జావను తాగేస్తున్నారు. నీరసం, నిస్సత్తువ లేకుండా రోజంతా హాయిగా గడిపేస్తున్నారు.

ragijava
ragijava

By

Published : Apr 21, 2023, 12:02 PM IST

Bellam Ragi Java to Students: ఉదయమే అల్పాహారం తినకపోతే.. పెద్దలే ఉండలేరు. అలాంటిది బడికెళ్లే పిల్లలు కచ్చితంగా ఏదో ఒకటి తినాల్సిందే. కానీ కొంతమందికి అది సాధ్యం కాదు. ముఖ్యంగా కూలీ నాలి చేసుకుని.. పొట్ట పోసుకునే వారి పిల్లల్లో చాలా మంది ఏమీ తినకుండానే పుస్తకాలు పట్టుకుని బడికి వచ్చేస్తుంటారు. వ్యవసాయ పనులు చేసే వారూ.. అల్పాదాయ వర్గాల పిల్లలూ అంతే. దీంతో వారు పాఠశాలకు రాగానే.. ఎక్కడలేని నీరసం ముంచుకొస్తుంది. ఎండాకాలంలో చాలా మంది పిల్లలు.. కళ్లు తిరిగి పడిపోతుంటారు కూడా. ఇలాంటి వారి కోసమే ప్రత్యేకంగా జనగామలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు బెల్లం జావ అందిస్తున్నారు. పోషకాలతో నిండిన ఈ జావ తాగి చిన్నారులు హుషారుగా తరగతులకు హాజరవుతున్నారు.

సత్య అన్నపూర్ణ ట్రస్ట్​ అందిస్తున్న రాగి జావ: నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు పోషకాహారం అందటం లేదని.. ఉదయం అల్పాహారం కూడా తినకుండా వస్తున్నారని గుర్తించిన మాజీ సైనికాధికారి కల్నల్ నరేందర్ రెడ్డి.. బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లి పాఠశాలలో మొదటి సారిగా విద్యార్థులకు రాగిజావ అందించారు. మిగతా పిల్లలకూ అందించాలన్న సదుద్దేశంతో బెంగళూరుకు చెందిన సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ను సంప్రదించి.. మరో మూడు మండలాల పాఠశాలల పిల్లలకూ బెల్లం జావను అందించే కార్యక్రమం చేపట్టారు.

508 పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ: జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక చొరవతో.. క్రమంగా ఇది విస్తరించి జిల్లాలోని 508 పాఠశాలల్లోని.. విద్యార్థులకు బెల్లంతో చేసిన రాగుల జావ అందిస్తున్నారు. బెంగళూరు నుంచి జావ పొట్లాలు రాగా.. వాటిని అన్ని పాఠశాలలకూ పంపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండే వారి సహాయంతో.. ఉదయమే పాఠశాలకు వచ్చిన పిల్లలకు.. రాగి జావ కాచి ఇస్తుంటే.. అది తాగిన పిల్లలు నిస్తత్తువ లేకుండా శ్రద్ధగా పాఠాలు వింటున్నారు.

గతంలో ఏమీ తినకుండా బడికి రావడంతో.. నీరసం ఉండేదని ఇప్పుడు రాగి జావ తాగాక.. కళ్లు తిరగడం లేకుండా శ్రద్ధగా పాఠాలు వింటున్నామని.. ఆరోగ్యంగా ఉన్నామని విద్యార్థినులు చెపుతున్నారు. మొదట ఒక పాఠశాల నుంచి ప్రారంభమై.. క్రమంగా విస్తరిస్తూ.. ఎంతోమంది పిల్లల ఆకలి తీరుస్తోందీ పోషకాల జావ. జనగామ జిల్లాలో జరుగుతున్న పోషకాహార జావ పంపిణీ విషయం తెలుసుకుని.. విద్యాశాఖ కూడా రాష్ట్రవ్యాప్తంగా వచ్చే విద్యాసంవత్సరం అన్ని పాఠశాలల్లో జావ పంపిణీకి సన్నాహాలు చేస్తోంది.

"అర్ధాకలితో పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్లు తిరిగి పడిపోయిన వాళ్లూ ఉన్నారు. 90 శాతం మంది పిల్లల తల్లిదండ్రులు రైతులు. వారందరూ ఉదయం లేవగానే పొలం పనులకు వెళతారు. దీంతో పిల్లలు పాఠశాలకు లేట్​గా రావడం జరుగుతుంది. ఉదయం తినకుండా వస్తున్నారు. వీరిని చూసి మాజీ సైనికాధికారి ప్రతి విద్యార్థికి పౌష్ఠికాహారం అందాలనే ఆలోచనతో ఇలా చేశారు."- విష్ణు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు

ఒక్కరి ఆశయం.. 508 పాఠశాలల విద్యార్థుల ఆకలి తీర్చింది..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details