గ్రేటర్ వరంగల్‌లో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఓరుగల్లులో ఓట్లు అడిగే హక్కు... పోటీ చేసే హక్కు తమకే ఉందని తెలిపారు. కేంద్ర సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు వివరించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. హన్మకొండ కాకతీయ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పార్టీ శ్రేణుల ఎన్నికల శంఖారావం సభలో సంజయ్ పాల్గొన్నారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటూ తెరాస నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని సంజయ్ విమర్శించారు.
వరంగల్‌లో అభివృద్ధి ఏదన్నా ఉంటే అది తమ వల్లేనని అన్నారు. వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని తామెక్కడా చెప్పలేదని... ఆయన స్పష్టం చేశారు. 2016లోనే రైల్వే ఓవరాలింగ్ యూనిట్‌కు స్ధలం ఇచ్చి ఉంటే... 5 వేల మంది నిరుద్యోగులకు ఇప్పటికే ఉపాధి లభించేదని తెలిపారు. కేఎంసీ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వాల్సిన 30 కోట్లు ఇవ్వకపోవడంతో... ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందట్లేదని వెల్లడించారు.