వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కోతుల గుంపు గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఏవి ఉంటే అవి ఎత్తుకుపోతున్నాయి. బట్టలు, వంటగిన్నెలు, ఆహారం, సరుకులు అన్నీ తీసుకెళ్లి బజార్లో వేస్తున్నాయి. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. గుర్రుమంటూ.. మీదికి వస్తున్నాయి. వాటి కోపానికి ఎక్కడ గురి కావాల్సి వస్తదో అని నిత్యం భయం భయంగా గడుపుతున్నారు.
కోతుల పితలాటకం... ప్రజలకు ప్రాణ సంకటం కునుకు లేకుండా చేస్తున్నాయి..
ఎత్తుకెళ్లిన వస్తువులు, గిన్నెలు ఎక్కడో చెట్లలో పడేస్తున్నాయని, తిరిగి వాటిని వెతుక్కొని తీసుకురావాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వానరాలు అయితే.. మాంసాహారానికి కూడా అలవాటు పడి జనాలపై దాడులు చేస్తున్నాయని వాపోయారు. ఉదయం, సాయంత్రం దాదాపు వందల సంఖ్యలో కోతులు మూకుమ్మడిగా ఇండ్లలోకి వస్తున్నాయని, వాటి భయానికి ఇంట్లో మహిళలు బయట వంట గిన్నెలు కూడా తోమడం లేదన్నారు. రేకుల ఇండ్లపైన దూకడం వల్ల పెద్ద శబ్దాలు వస్తున్నాయని, పెంకుటి ఇండ్ల పైన పెంకలను కూడా పెరికి వేస్తూ గ్రామస్థులకు నిద్రలేకుండా చేస్తున్నాయి.
ఏకంగా రెండువేల కోతులు..
ఊరిలో దాదాపు రెండు వేల వరకు కోతులున్నాయి. వాటిని నివారించడానికి కోతులు పట్టే వారిని పిలిస్తే పది లక్షలు ఖర్చు అడిగారని.. గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తెలిపారు. సాధారణ సమావేశాలు, గ్రామసభల్లో కూడా మెజారిటీ ప్రజలు, వార్డు సభ్యులు కోతుల బెడదను తప్పించాలని కోరారు. ఉన్నతాధికారులు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే.. కోతుల బాధను తప్పించడానికి అవకాశం ఉంటుందని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఈ విషయమై పలుమార్లు అధికారులను అడిగామన్నారు.
కలెక్టర్కు వినతి..
చివరకు కోతులు పోలీస్ స్టేషన్ను కూడా వదలలేదు. ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లోని పోలీసు కుటుంబాల నివాస గృహాల సముదాయలలో ప్రవేశించి హల్చల్ చేస్తూ నానా అల్లరి చేస్తున్నాయనిఎస్సై గడ్డం ఉమ తెలిపారు. కోతుల దాడి విషయమై చాలామంది గ్రామస్థులు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. స్థానిక సర్పంచ్ గ్రామస్థులతో కలిసి ఎల్కతుర్తి పోలీసుల ఆధ్వర్యంలో కోతులను గ్రామంలోకి రాకుండా నివారించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి :అవగాహన రాహిత్యంతోనే కేంద్రంపై విమర్శలు: కిషన్రెడ్డి