టెక్నోజియాన్ 2019 ఉత్సవం... ఆద్యంతం ఆలోచింపజేసేదిగా సాగింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ ప్రయోగాలతో అబ్బురపరిచారు. సృజనాత్మకతకు అద్దం పడుతూ వివిధ విభాగాల్లో సత్తా చాటారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి దాదాపు 5 వేల మందికిపైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. విద్యార్థులే నిర్వాహకులుగా 55కిపైగా ఈవెంట్లను నిర్వహించగా... పలు అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యశాలలను ఏర్పాటు చేశాయి. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ పేరుతో రోబో తయారీ కార్యశాలలో పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏవియాన్ అనే విభాగంలో బుల్లి విమానాలను తయారు చేసి రిమోట్ కంట్రోల్ సహయంతో వాటిని గగనతలంలో విహరింప చేశారు.
అలరించిన బుల్లి రోబోలు
దిల్లీకి చెందిన వింగ్ఫోటెక్ కంపెనీ ఆధ్వర్వంలో ప్రదర్శించిన నాట్యం చేసే బుల్లి రోబోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. సెల్ ఫోన్లో పాటలకు అనుగుణంగా రోబోలు చిందులేసి అదరహో అనిపించాయి. వ్రెకేజ్ విభాగంలో రాడార్ కంట్రోల్ కార్ల రేస్ ఆకట్టుకుంది. మొబైల్ కంట్రోల్ రోబోస్ పేరుతో రోబో కారుకి ఫోన్‌ను బిగించి దానిని మరో ఫోన్‌తో అనుసంధానం చేసి రోబో కారుని ముందుకు కదిలేలా సాంకేతికతను ప్రదర్శించారు. వార్ రోబోస్, వాటర్ రాకెట్, ఆర్సీ సాకర్, వంటి వివిధ ప్రదర్శనలు ఆలోచింపజేశాయి.
మేమంతా మీ వెంటే ఉన్నాం...
విద్యార్థులు నిర్వహించిన లెటర్స్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి మంచి స్పందన కనిపించింది. చంద్రయాన్-2 ప్రయోగం కొద్దిలో చేజారినా... మేమంతా తమ వెంటే ఉన్నామని ఇస్రో శాస్త్రవేత్తలకు వందలాది మంది విద్యార్థులు అభినందనలు తెలియచేస్తూ ఉత్తరాలు రాశారు. ఈ ఉత్తరాలను ఇస్రో శాస్త్రవేత్తలకు పంపే విధంగా ఏర్పాటు చేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రదర్శనలకు వచ్చే వీక్షకులు స్వచ్ఛందంగా అందించిన నగదును జమ చేసి బాలసదన్ అనే ఆశ్రమానికి అందించడానికి ఏర్పాట్లు చేశారు.