రాష్ట్రంలో మాంసం నాణ్యతపై పరిశీలన కరవైంది. ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారుల తనిఖీలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. దసరా పండగ వేళ దాదాపు ప్రతి ఇంటా మాంసం కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం కొవిడ్ వేళ(covid) నాణ్యమైనది విక్రయిస్తున్నారా? లేదా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించి కొనుగోలు చేయాలి. మాంసం శుభ్రత, నాణ్యత, ధరల విషయంలో తగిన నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా అమ్మే ప్రమాదముంది. అందువల్ల నమ్మకమైన వ్యాపారుల వద్ద తీసుకోవాలి. చాలాచోట్ల కుల, పరపతి, కార్మిక సంఘాలు, వాడల్లో సామూహికంగా జీవాలను కొనుగోలు చేస్తుంటారు. అలాంటి వారు ఆరోగ్యంగా ఉన్న మేకలు, గొర్రెలు మాత్రమే కొనుగోలు చేయాలి. ధర తక్కువ వస్తుందని ఏది పడితే అది కొంటే అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి.
ఇష్టారాజ్యంగా ధరల పెంపు
దసరా పండగకు ముందే మాంసం ధరలు(mutton cost in telangana) కొండెక్కాయి. సాధారణ రోజుల్లో పొట్టేలు మాంసం కిలో రూ.700-800 వరకు ఉండగా ప్రస్తుతం రూ.800- 900కు విక్రయిస్తున్నారు. గతంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో మేకలు, గొర్రెలు దొరకనందున హైదరాబాద్ జియాగూడ, ఘటకేసర్, అనంతపూర్, కర్నూలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెబుతున్నారు. రవాణ, భారం ఎక్కువైందంటున్నారు.
ఒక ముక్క ధర ఎంతంటే..
ఒక కిలో మటన్ కొంటే మధ్యస్థ స్థాయి ముక్కలైతే 55- 60 వస్తాయి. కిలో ధర రూ.800 ఉంటే, ఒక ముక్క ధర రూ.13.50- రూ.14.5 మధ్య ఉంటుంది. పెద్ద ముక్కలైతే 35- 40 వస్తాయి. ఒక్కో దానికి రూ.20-రూ.23 మధ్య ధర ఉంటుంది.
నిబంధనలు ఇవే..
* మటన్ విక్రయదారులు మేకలు, గొర్రెలను బల్దియాకు చెందిన జంతు వధశాలల్లోనే వధించాలి. పశుసంవర్ధక శాఖ వైద్యుడు పరిశీలించాలి.
* గ్రేటర్ పరిధిలోని పేరుతో మాంసంపై రౌండ్ సీల్ ఉండాలి. ఈ నిబంధనలు పాటించని వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.
* మాంసం ధరలు బహిరంగ పరచాలి. ఎలక్ట్రానిక్ కాంటాలు వాడాలి. తూకం పారదర్శకంగా ఉండాలి.
* ప్లాస్టిక్ సంచులు వాడకూడదు. స్టీల్ టిఫిన్ బాక్స్‌లు, అడవి తుంగ ఆకులు, కాగితం వాడాలి.
* కొవిడ్-19 నిబంధనల దృష్ట్యా విక్రయదారులు, కొనుగోలుదారులు మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించేలా చూడాలి.
* రోజుల తరబడి నిల్వ చేసిన మాంసం విక్రయంచకూడదు.