దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానని చెప్పి... ఇప్పుడు చెప్పలేదని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. సీఎం కేసీఆర్ మోసపూరిత ప్రకటనలు చేస్తూ... తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దళితబంధు పథకం ఆలోచన మంచిదని... కానీ ఆచరణలో అమలు చేయాలని మాట్లాడితే దాన్ని కాంగ్రెస్ వాళ్లు ట్రోల్ చేస్తున్నారని వెల్లడించారు.
'దళితబంధుకు భాజపా వ్యతిరేకం కాదు.. అందరికీ అందే వరకు పోరాడతాం' దళితబంధు అమలు చేసే వరకు వెంటాడతాం..
దళితబంధు పథకానికి తాము వ్యతిరేకం కాదని... దళితులందరికి పది లక్షలు రూపాయలు ఇచ్చే వరకు భాజపా పోరాటం చేస్తుందని చెప్పారు. లేకపోతే ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడి ఇంటికి అందేలా పోరాటం చేస్తామని అన్నారు.
ఎన్నికల తర్వాత అలాగే అంటాడు
శాసనసభలో జరిగిన అనేక అంశాలను ప్రజలు గమనించాలి. ఇంతకు ముందెన్నడు సీఎం కేసీఆర్ అంత అసహనంగా సభలో కనిపించలేదు. పదేపదే నా పేరు ప్రస్తావిస్తూ వారు చెప్పాలనుకున్న మాటల్ని పరోక్షంగా, వెటకారంగా చెప్పే ప్రయత్నం చేశారు. దళితబంధును భాజపా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. దళితబంధును మేము ఆహ్వానించాం. ఆలోచన మంచిది.. కానీ ఆచరణలో ఎంతవరకు అమలు చేస్తారనేదానిమీద ఈ పథకం ఫలితాలు ఉంటాయని నేను చెప్పాను. నా మాటలను వక్రీకరించి కొందరు ట్రోల్ చేస్తున్నారు. మంచి చేస్తే ఎవరినైనా మంచే అంటాము.. దానిలో తప్పేముంది..? గత అనుభవాలు చూస్తే ముఖ్యమంత్రి చెప్పే ఏ మాట కూడా పూర్తిస్థాయిలో అమలుకాలేదని నేను చెప్పదలచుకున్నాను. 119 నియోజకవర్గాల్లో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చేంత వరకు భాజపా మిమ్మల్ని వెంటాడుతుంది, వేటాడుతుంది, ఒత్తిడి తెస్తుంది... ఇవ్వక పోతే ప్రజాక్షేత్రంగా మిమ్మల్ని దోషిగా నిలబెడుతుంది. కేంద్ర, రాష్ట్ర పథకాలు గరీబోళ్ల ఇంటికి చేరడమే భాజపా లక్ష్యం. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పలేదు, దళితులకి మూడెకరాల భూమి ఇస్తామని చెప్పలేదు, రేపు హుజూరాబాద్ ఎన్నికలు అయిన తర్వాత నేను దళితులకు దళితబంధు ఇస్తానని చెప్పలేదు అంటాడు ముఖ్యమంత్రి.- రఘునందన్‌రావు, భాజపా ఎమ్మెల్యే.
ఇదీ చూడండి:Bjp Mahila Morcha: బతుకమ్మను జాతీయ పండుగగా గుర్తించాలి: రాంచంద్రారెడ్డి