రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాల పట్ల తెరాస ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఇందుకు నిరసనగా వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం వడ్డేపల్లిలోని శివాలయంలో శుక్రవారం రాత్రి ఆయన నిద్ర చేశారు.
అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్రానికి మార్గాన్ని సుగమం చేశాయని మందకృష్ణ పేర్కొన్నారు. వారి త్యాగాలను సమాధి చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మహాజన సోషలిస్టు పార్టీతో 2023లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరుల కాంస్య విగ్రహాలను వారి వారి గ్రామ, మండల కేంద్రాల్లో ప్రతిష్టిస్తామని, అమరుల త్యాగ దినాన్ని నిర్వహించడంతో పాటు వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.