Kaloji Health University Notification on PG Medical Seats : రాష్ట్రంలో పీజీ వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడత పీజీ వైద్య విద్య సీట్ల ప్రవేశాల కోసం.. ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించనున్నట్టు తెలిపింది.కాళోజీ హెల్త్ వర్సిటీ (Kaloji Health University)పరిధిలోని కళాశాలలకు అదే విధంగా.. నిమ్స్ మెడికల్ కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ నెల 13 ఉదయం 8 గంటల నుంచి 15వ తేదీ రాత్రి 8 గంటల వరకూ.. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇప్పటికే మెరిట్ జాబితా.. అదేవిధంగా సీట్ల ఖాళీల ( Medical Seats) వివరాలను.. వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inలో చూడాలని అధికారులు సూచించారు.
ఎంసెట్ పరీక్ష ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ
మరోవైపు తెలంగాణలో 2014 జూన్ తర్వాత కాంపిటీటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను.. రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తున్నట్లు.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల ఆడ్మిషన్ నిబంధనలు-2017ను సవరించింది. ఇదివరకు ఉన్న నిబంధనల ప్రకారం వైద్య కళాశాలల్లోని మొత్తం సీట్లలో.. 85 శాతం కాంపిటీటివ్ అథారిటీ కోటా కాగా.. మిగతా 15 శాతం అన్‌రిజర్వుడ్ విభాగానికి చెందుతాయి.