కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఫోన్‌లో వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘టెలి మెడిసిన్’ కేంద్రం సత్ఫలితాలిస్తోంది. ఏప్రిల్ 8 నుంచి వరంగల్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఈ కేంద్రాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఇందులో జనరల్ ఫిజీషియన్‌తోపాటు అయిదుగురు స్పెషలిస్టు వైద్యులు పని చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజల సౌకర్యం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక వాట్సప్ నంబర్‌తోపాటు మరో రెండు ఫోన్ నంబర్లు ఇచ్చారు. ఉదయం పదింటి నుంచి సాయంత్రం అయిదింటి వరకు నడిచే ఈ కేంద్రానికి ప్రజలు కాల్ చేసి వైద్య సేవలు పొందుతున్నారు.
ఫోన్లో వైద్యం.. ఇంట్లో నుంచే సాధ్యం - వరంగల్‌లో టెలి మెడిసిన్ సేవలు
లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో టెలి మెడిసిన్ ద్వారా చేస్తున్నసేవలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రజలకు ఫోన్‌లో వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ఏప్రిల్ 8 నుంచి వరంగల్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో రాష్ట్రంలో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోజుకూ 20 నుంచి 50కి పైగా కాల్స్ వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.
వరంగల్ టెలి మెడిసిన్ కేంద్రానికి ఏప్రిల్ 8న 24, 9న 39, 10న 50, 11న 59 కాల్స్ వచ్చాయి. రోజు రోజుకు స్పందన పెరుగుతోంది. ఇక కొందరు వాట్సప్ ద్వారా కూడా వీడియో కాల్ చేసి ఫోన్‌లో వైద్యులతో మాట్లాడి ఔషధ సలహాలు పొందుతున్నారు. తమ కేంద్రానికి విదేశాల నుంచి కూడా కొందరు కాల్ చేసి వైద్య సలహాలు పొందుతున్నారని వరంగల్ కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ పి.సత్యసోమ మల్లికార్జున్ తెలిపారు. వరంగల్ తర్వాత కరీంనగర్, ఖమ్మంలో కూడా టెలి మెడిసిన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :రూ. 1500కే కరోనా పరీక్ష.. రెండున్నర గంటల్లో ఫలితం