వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఎక్కడికక్కడ వరదనీరు ముంచెత్తి లోతట్టు ప్రాంతాలను జలమయం చేస్తుంది. నదీ పరివాహన ప్రాంతాలతో పాటు.. వాగులు, వంకలు చెరువులు ఉన్న ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో పరిస్థితి ఇది..
వర్షాలు, వరదలు అనగానే ముందుగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం, మంచిర్యాల జిల్లాలు వరుణుడి ప్రకోపానికి చిగురుటాకుల వణికాయి. వరదల దెబ్బకు అలతాకుతలం అవుతున్నాయి. పోటెత్తిన వాగులతో.... ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో ప్రధాన పర్యాటక కేంద్రాలైన కుంటాల, పొచ్చర జలపాతాలకు వరద ఉద్ధృతి తగ్గింది. పర్యాటకుల సంఖ్య పెరగడంతో జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు జలపాతాన్ని సందర్శించి.. పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకున్నారు.
అర్ధరాత్రి వేళ 40మందిని కాపాడారు
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. మూడురోజులుగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోమటిగూడ వాగులో చిక్కుకున్న సుమారు 40 విద్యార్థులు, మహిళలను పోలీసులు కాపాడారు. అర్ధరాత్రి సమయంలో సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వారిని రక్షించారు. కుమురం భీం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరడంతో నిన్న 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. పలు గ్రామాలు నీట మునిగాయి. పెంచికలపేట మండలం ఎల్కపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద కార్మికులు నీటిలో చిక్కుకున్నారు. పోలీసులు, స్థానికుల సాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు.
ఓరుగల్లుపై వరుణుడి ప్రకోపం
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు అతలాకుతలం చేశారు. వరంగల్ నగరంలో కాలనీలు జలమయ్యాయి. పోటెత్తిన వాగులతో.... ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. భద్రకాళి జలాశయంతో పాటు రంగసముద్రం, వడ్డేపల్లి చెరువు మత్తడి పోస్తున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. వరద ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి.... సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట నుంచి నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారిపై వరద ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. పురిటి నొప్పులతో నర్సంపేట ఆస్పత్రికి వెళ్తున్న ఓ మహిళను స్థానిక యువకులు... స్టెచర్‌పై మోసుకెళ్లారు. భారీ వర్షాలతో ములుగు జిల్లాలో లక్నవరం సరస్సు మత్తడి పోస్తోంది. వెంకటాపురం మండలంలో గిన్నెల వాగు, బొగ్గులవాగు, జంపన్నవాగు ఉద్ధృతికి.... ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
యువకుడు మృతి.. మంత్రి పరామర్శ
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. నెల్లికుదురు మండలం మునిగలవీడు శివారులో చౌట కుంట కట్టకు గండి పడింది. వరదల కారణంగా తొర్రూరు నుండి నర్సంపేట, నెక్కొండ-గూడూరు, బయ్యారం, మెట్లతిమ్మాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లికుదురు మండలంలో పలుఇళ్లు కూలిపోయాయి. మొట్లతిమ్మాపురం శివారులో ఉడుముల వాగు దాటుతూ.... ఓ యువకుడు గల్లంతయ్యాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సత్యవతి రాఠోడ్.... కుటుంబసభ్యులను ఓదార్చారు. నెల్లికుదురు మండలం కాచికల్లు, కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో రెండు ఇళ్లు కూలిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం పలుగులలో ఇసుక క్వారీ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు వరదలో చిక్కుకోగా... అధికారులు రక్షించారు.