Delay In Double Bedroom Houses Distribution Joint Warangal :రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. వరంగల్ జిల్లాలో పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఇండ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. మరికొన్ని చోట్ల పూర్తైనా ఇళ్ల మంజూరులో జాప్యం జరిగింది. ఉండటానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ ఆలస్యం కావడంతో... చివరికీ ఏం చేశారంటే.!
నిర్మాణం పూర్తైనా లబ్ధిదారుల ఎంపికలో జాప్యం :హనుమకొండ జిల్లాకు పదేళ్ల క్రితం గుడిసెల్లో జీవిస్తున్న నిరుపేదల వద్దకు అప్పటి సీఎం కేసీఆర్ (KCR) వచ్చి బాగోగులు తెలుసుకున్నారు. వారి కష్టాలను చూసి సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించడంతో కేసీఆర్ హామీ మేరకు బహుళ అంతస్తుల్లో నిర్మాణాలు మంజూరయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బాలసముద్రంలోని ఏషియన్ మాల్ సమీపంలోని శిఖం భూమిలో ఒక్కో బ్లాకులో 10 చొప్పున మొత్తం 57 బ్లాకుల్లో నిర్మించారు. 582 మంది లబ్దిదారులకు కేటాయించేలా 2019లో పూర్తి చేశారు. నిర్మాణం పూర్తైనా లబ్దిదారుల ఎంపికలో జాప్యం జరగ్గా ఐదేళ్లుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నామని గుడిసెవాసులు వాపోతున్నారు.
"తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇస్తామన్నారు. దీంతో 600 కుటుంబాలు పాత నివాసాలను ఖాళీ చేశాం. 13 ఎకరాలను విడిచి దూరంగా గుడిసెలు వేసుకొని ఉన్నాం. రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి, పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. 2018లో డబుల్ బెడ్ రూం నిర్మాణాలను పూర్తిచేసిన ఇప్పటివరకు ఇవ్వలేదు. హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి, హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత వాగ్దానాన్ని పెడచెవిన పెడుతోంది." -స్థానికులు