తెలంగాణ

telangana

By

Published : Feb 12, 2021, 9:29 AM IST

ETV Bharat / state

ఎమ్మెల్సీ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారం

వరంగల్, నల్గొండ, ఖమ్మం.. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో... ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు... ప్రచారాల జోరు పెంచారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నడకలోనూ ప్రచారాలు చేపట్టారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారం
ఎమ్మెల్సీ అభ్యర్థుల పోటాపోటీ ప్రచారం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముహుర్తం సమీపించడంతో..... ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలను మరింత ముమ్మరం చేశారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశాయి. తెరాస తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మరోసారి అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఆరంభం నుంచి పల్లాయే అభ్యర్థిగా పోటీలో ఉంటారన్నది తెలిసినా.... ఈ నెల 7న తెలంగాణ భవన్​లో జరిగిన కార్యనిర్వాహక సభలో ముఖ్యమంత్రి అధికారికంగా ఖరారు చేశారు. అయితే ఇప్పటికే పల్లా రాజేశ్వరరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో.... విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్​ఘన్​పూర్, లింగాల ఘన్​పూర్, వేలేరు మండలం షోడసపల్లిలో సన్నాహక సమావేశాల్లో అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ పసునూరి దయాకరరావు... ఇతర నేతలు పాల్గొన్నారు. అసలైన సంక్షేమం తెరాస హయంలోనే ప్రజలకు అందిందని నేతలు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చేసిన అభివృద్ధి.. దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఇది విశ్లేషించుకుని.... తమ పార్టీకి పట్టం కట్టాలని అన్నారు.

ఇక అందరి కన్నా ముందే.. భాజాపా నుంచి పేరు ఖరారైన... గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, తెజస అభ్యర్థి కోదండరాం... జిల్లాల్లో పలుమార్లు పర్యటించి ప్రచారం నిర్వహించారు. రెండు రోజల క్రితమే.. కాంగ్రెస్ నుంచి రాములునాయక్ పేరు... ఎమ్మెల్సీగా ఖరారు కాగా.. త్వరలోనే వరంగల్ జిల్లాలో ప్రచారానికి... ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇక వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా జయసారథిరెడ్డి కూడా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ... పట్టభద్రుల మద్దతు కోరుతున్నారు. యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీకి దిగుతున్న రాణి రుద్రమతోపాటుగా మరికొందరూ ప్రచారాలు చేస్తున్నారు. షెడ్యూల్ వెలువడడం.... ఎన్నికల ముహుర్తం ఖరారుకావడంతో ఇక ముందు ముందు అభ్యర్థులు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మరింత జోరుగా ప్రచారాలు నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details