పింఛను డబ్బులు వస్తే తన బాగోగులు చూసుకునే వారికి ఆర్థిక భారం తగ్గుతుందంటూ అనూష గత నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తుంది. మానవతా దృక్పథంతో నాయకులు, అధికారులు కనికరించాలని కోరుకుంటుంది. హనుమకొండ జిల్లా సంగెం మండలం ముండ్రాయి గ్రామానికి చెందిన కడిదల అనూష వంద శాతం మానసిక దివ్యాంగురాలు. పుట్టినప్పటి నుంచి మాట్లాడలేదు. సరిగా నడవలేదు.
పదిహేను సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు మృతి చెందారు. దీనస్థితిలో ఉన్న అనూష పోషణను హనుమకొండ జిల్లా నడికుడ మండలం రామకృష్ణాపూర్ గ్రామంలోని అమ్మమ్మ, తాతయ్యలే చూసుకుంటున్నారు. మానసిక, శారీరక దివ్యాంగురాలైన అనూషకు పింఛను మాత్రం రావడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి ఆమెకు పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
"ఆమె తల్లిదండ్రులు అనూష చిన్నతనంలోనే మరణించారు. రూ.5 వందలు, రూ.15 వందలు ఉన్నప్పుడు పింఛను వచ్చింది. గత కొన్నిరోజులుగా పింఛన్ రావడం లేదు. ఆమెను వాళ్ల అమ్మమ్మ, తాతయ్యలే చూసుకుంటున్నారు. అధికారులు పింఛను మంజూరు చేయాలి." -కరుణాకర్, గ్రామస్థుడు
దివ్యాంగురాలు కావడంతో మందులు, ఇతర ఖర్చులు మొత్తం కలిపి ప్రతి నెలా రూ.5 వేల వరకు అవుతుంది. అయితే అనూషకు గతంలో నెలకు రూ.1500ల పింఛన్ వచ్చేదని.. ఆసరా పెన్షన్‌లో ఆధార్ అప్డేట్ కాకపోవడంతో నాలుగేళ్లుగా రావడం లేదని అనూష అమ్మమ్మ తెలిపారు. వేలిముద్రలు తీసుకుందామన్నా సరిగా పడటం లేదు. కనీసం కంటి ద్వారా ఐరీష్ పరీక్ష చేద్దామన్నా అదీ రావడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తమకు మనవరాలి నిర్వహణ భారంగా ఉందని, అధికారులు స్పందించి ఆసరా పింఛను తిరిగి పునరుద్ధరించాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.