వరంగల్ గ్రామీణ జిల్లా గొర్లెకుంట గోదాం సమీపంలోని పాడుబడిన బావిలో 9 మృతదేహాలు వెలుగుచూసిన ఘటనకు సంబంధించి.. పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఇవాళ ఉదయం అదనపు డీసీపీ వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసులు, ఐబీ బృందం.. బావి పరిసర ప్రాంతాలను ముమ్మరంగా శోధించారు. మక్సూద్, బిహారీ యువకులు ఉంటున్న గదులను.. అక్కడి నుంచి బావికి ఉన్న దూరాన్ని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ వైద్య నిపుణులు రజామాలిక్ను తీసుకెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. బావిలోకి సైతం దిగి అణువణువూ శోధించారు.
ఎవరా మహిళ?
గొర్రెకుంట ప్రాంతం వద్ద మూడు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్ డేటా సేకరిస్తున్నారు. కేసుకు సంబంధించి ఇద్దరు బిహారీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేసు పురోగతికి చెందిన కీలక సమాచారం పోలీసులు రాబట్టారు. బిహార్‌కు చెందిన యువకుడి చరవాణి నుంచి ఒక మహిళకు ఫోన్ వెళ్లినట్లుగా ఉండటం వల్ల ఆమెనూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో శవపరీక్ష నివేదిక కీలకం కానుంది.