Variety Ganesh Idols 2023 in Warangal :పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ మట్టి గణపతులతో ముందుకు సాగుతున్నారు ఓరుగల్లు వాసులు. పర్యావరణహితంతో పాటు.. సందేశాత్మక ఆకర్షణీయ ప్రతిమలను కొలువుదీర్చారు. హన్మకొండ సుధానగర్‌కు చెందిన నిర్వాహకులు.. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానకి వీలుగా తలమీదే రక్షణ మీదే అంటూ.. వాహనదారుడికి హెల్మెట్ అందిస్తున్నట్లు ఉమాసుతుడ్ని ఏర్పాటు చేశారు.
కాశీ బుగ్గలో వెండివర్ణంతో భారీ గోపురంతో పాటు దక్షిణామూర్తి తరహాలో లంబోదరుడ్ని కొలువుదీరాడు. చార్‌బౌళిలో కోలాటం నృత్యాలు, మంగళ వాద్యాల నడుమ... సిద్ధి, బుద్ధి సహిత విఘ్నేశ్వరుడిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. వరంగల్ చౌరస్తాలోని శ్రీలక్ష్మీ వినాయక కార్పొరేషన్ సభ్యులు ఏకంగా.. 10,116 రాఖీలతో వినాయకుని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒడిశా కళాకారులు నెల రోజులపాటు శ్రమించి ఈ విగ్రహం తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణంతో కూడిన దూది రాఖీలను ఇందుకు ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Variety Ganesh Idols 2023 in Telangana : ఏటా భిన్నంగా దర్శనమిచ్చే గీతా భవన్ వినాయకుడు.. ఈ ఏడాది దాల్చిన చెక్క, డ్రై ఫ్రూట్స్‌తో కొలువుదిరి భక్తులను కనువిందు చేస్తున్నారు. బెంగాల్‌కి చెందిన కళాకారులు 10 రోజుల పాటు శ్రమించి.. 100 కిలోల దాల్చిన చెక్కను ఉపయోగించి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు వివరించారు. పిన్నవారి వీధికి చెందిన కాకతీయ యూత్ అసోసియేషన్ సభ్యులు బాలగణపతిని ప్రతిష్టించారు. మబ్బుల నడుమ బాలగణపతి చూడరమ్యంగా ఉన్నాడు.