వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన కాసు చేరాలు తన రూ.1.50 లక్షలు నిల్వ ఉన్న సంచిని పెంపుడు కుక్క ఎత్తుకెళ్లి ఎక్కడో పడేసిందంటూ లబోదిబోమంటున్నారు. బాధితుడు తెలిపిన ప్రకారం.. తన వద్ద ఉన్న నగదును సంచిలో నడుముకు కట్టుకుని కాపాడుకుంటుంటారు. ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు సంచిని విప్పి ఓ చోట పెట్టి ఆ తరువాత మళ్లీ నడుముకు కట్టుకుంటారు.
రెండు రోజుల క్రితం ఈ సంచిని విప్పి మంచం మీద పెట్టి స్నానం చేయడానికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి మంచం వద్ద ఉన్న పెంపుడు కుక్క లేక పోగా సంచి కన్పించలేదు. కుక్క కోసం వెతగ్గా, కొన్ని గంటల తరువాత వచ్చింది. కుక్కనే సంచి ఎత్తుకెళ్లిందని, ఎవరికైనా దొరికితే తనకు అప్పగించాలని బాధితుడు చేరాలు వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. గ్రామంలో ఇల్లిల్లూ తిరిగి ఆరా తీస్తున్నారు.