రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట హత్యల మిస్టరీని 72 గంటల్లోనే ఛేదించిన వరంగల్ పోలీసులు సోమవారం ఆ రాక్షసుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాలుగు సెల్ ఫోన్లు, మూడు వందల నగదు, ఉపయోగించిన సైకిల్, వాల్ మార్ట్ నుంచి తెచ్చుకున్న సామగ్రిని నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మార్చిలో చేసిన హత్యను కప్పిపుచ్చుకునేందుకు.. మరో 9 హత్యలు చేశాడు సంజయ్ కుమార్ యాదవ్.
సాన్నిహిత్యమే కారణం
ఐదేళ్ల క్రితం మక్సూద్ భార్య నిషా ఆలమ్ సోదరి కుమార్తె రఫిక బంగాల్ నుంచి వరంగల్‌కు ఉపాధి కోసం వచ్చింది. సంజయ్ కుమార్ ఒంటరిగా జీవనం సాగించేవాడు. సంజయ్‌కుమార్‌కు డబ్బులు తీసుకుని రఫిక భోజనం ఏర్పాటు చేసేది. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఉన్న రఫిక, సంజయ్‌కుమార్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. రఫిక కుమార్తెతో కూడా సంజయ్‌కుమార్ సన్నిహితంగా ఉండేవాడు. ఇదే విషయంపై రఫిక నిలదీసింది. సంజయ్‌కుమార్‌తో పలుమార్లు గొడవపడేది. ఆమెను వివాహం చేసుకుంటానని సంజయ్ నమ్మించాడు. ఆ తర్వాత కూడా రఫిక కుమార్తెతో సన్నిహితంగా ఉన్నాడు. సంజయ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫిక బెదిరించింది.
అడ్డు తొలగించుకునేందుకే
వివాదం ముదరక ముందే రఫికను అడ్డుతొలగించుకోవాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. పెళ్లి విషయాన్ని బంధువులతో చర్చించేందుకు బంగాల్ వెళ్దామని నమ్మించాడు. మార్చి 6న గరీబ్ రథ్ రైలులో రాత్రి 10 గంటలకు రఫికను తీసుకుని బయలుదేరాడు. రైలులోనే రఫికకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగ అందించాడు. మత్తులోకి జారుకోగానే ఆమె చున్నీతో గొంతు బిగించి చంపాడు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు వద్ద రైలు నుంచి తోసేశాడు. అనంతరం ఏం తెలియనివాడిలా రాజమహేంద్రవరంలో దిగి.. మరో రైలులో వరంగల్ చేరుకున్నాడు.
నిలదీసిన నిషా ఆలమ్‌ను కూడా..
బంగాల్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లిందని మృతురాలి పిల్లలను నమ్మించాడు. రఫిక బంధువుల ఇంటికి రాలేదని తెలిసిన తర్వాత మక్సూద్ భార్య నిషా ఆలమ్ సంజయ్‌ను నిలదీసింది. పోలీసులకు సమాచారం ఇస్తానని బెదిరించింది. నిషా ఆలమ్‌ను కూడా చంపాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. రఫిక మాదిరిగానే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి నిషా ఆలమ్‌ను చంపాలనుకున్నాడు. మే 16-20 వరకు మక్సూద్ కుటుంబం పనిచేస్తున్న పరిశ్రమ చుట్టూ తిరిగాడు.