కరోనా కారణంగా వరంగల్ గ్రామీణ జిల్లాలోని పలు మండలాల్లో వరి కోతలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఒకపక్క కూలీలు దొరకని పరిస్థితి ఉండగా, మరో పక్క హార్వెస్టర్ మిషన్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దొ గొప్పో అందుబాటులో ఉన్న హార్వెస్టర్ మిషన్లతో అధిక ధరలతో రైతులు కోయిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి, పర్వతగిరి, సంగెం, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల్లో వరి కోసేందుకు కూలీలు రావడంలేదు. ధరలు కొంచెం ఎక్కువైనా హార్వెస్టర్ మిషన్ల సాయంతో తమ పంటలను కోసుకుంటున్నారు.
అధికారుల చర్యలేవి..
ఇలాంటి పరిస్థితుల్లో పండించిన ధాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కరోనా విపత్తు వల్ల ఈసారి రైతులకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా నీరు ఉన్న చీడపీడలతో కొంత నష్టం జరిగిందని గతంలో కంటే ఈసారి పంట విస్తీర్ణం పెంచినప్పటికీ చీడపీడల కారణంగా లాభాల మాట పక్కన పెడితే నష్టాలే వచ్చే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు.