PG Medical Student Attempt to Suicide: విధి నిర్వహణలో సీనియర్ వైద్య విద్యార్థి వేధిస్తున్నాడని ఓ పీజీ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి యత్నించింది. రోజు మాదిరిగానే విధులకు వెళ్లిన వైద్య విద్యార్థిని ఈ రోజు తెల్లవారు జామున ఆస్పత్రిలోనే హానికర ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో జరిగింది. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే బాధితురాలికి చికిత్స అందించడానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాస్ ధ్రువీకరించారు. ప్రస్తుతం వైద్యవిద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆర్‌ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రీతి అనే వైద్య విద్యార్థి అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఓ సీనియర్ విద్యార్థి తనను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని ప్రీతి తన కుటుంబసభ్యులతోను చెప్పింది. రెండు రోజులు క్రితం మరోసారి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రీతిని వేధించినట్లు సమాచారం. దీనిపై బాధితురాలి ఫిర్యాదు చేయడంతో వేధింపులకు గురిచేసిన సీనియర్ వైద్య విద్యార్థిని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మందలించారు. అయినప్పటికీ ఇవాళ తెల్లవారుజామున ప్రీతి ఆత్మహత్యకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో అక్కడకు చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.