తెలంగాణ

telangana

ETV Bharat / state

Tiger near pakala Forest: రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం.. హడలెత్తిన వాహనదారులు - అభయారణ్యంలో పెద్దపులి

Tiger near pakala forest: పాకాల అడవుల్లో పెద్దపులి సంచారం స్థానికులను భయానికి గురిచేస్తోంది. నర్సంపేట ఫారెస్ట్ డివిజన్​లోని అభయారణ్యంలో సంగెం కాలువ పక్కన వాహనదారులకు పులి కనిపించింది. దీంతో వాహనాదారులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.

Tiger near pakala Forest
పులి సంచారించిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు

By

Published : Nov 30, 2021, 6:34 PM IST

Tiger near pakala forest: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల అడవిలో పులి సంచారం కలకలం రేపుతోంది. పాకాల అభయారణ్యంలోని సంగెం కాలువ పక్కన వాహనదారులకు పులి కనిపించినట్లు చెబుతున్నారు. పులిని ఒక్కసారిగా చూసిన వాహనదారులు భయాందోళనకు గురై పరుగులు తీశామని తెలిపారు. ఒక్కసారిగా భయాందోళనలో ఉండగానే పులి అడవిలోకి పరిగెత్తిందని వాహనదారులు చెప్పారు.

tiger near pakala checkpost: అదే క్రమంలో నిన్న రాత్రి పాకాల చెక్ పోస్ట్ సమీపంలో కోనాపురం గ్రామానికి చెందిన ననుబోతుల లింగయ్య ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పులి ఎదురుగా రావడంతో వాహనాన్ని అక్కడే వదిలేసి పరుగులు తీశారు. అదే మార్గం గుండా భారీ వాహనం రావడంతో ఆ శబ్దానికి పులి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయిందని లింగయ్య తెలిపారు.

ద్విచక్ర వాహనదారులకు ఎదురైన పెద్దపులి.. భయాందోళనలో స్థానికులు

'కోనాపూర్ నుంచి నర్సంపేటకి వెళ్లి వస్తున్నాం. దారి మధ్యలో ఎదురుగా పులి వచ్చింది. దాన్ని చూసి మేం అక్కడే నిలిచిపోయాం. అంతలోనే ఓ పెద్ద వాహనం రావడంతో మా మీదకి రాకుండా అడవిలోకి వెళ్లిపోయింది. మేం మా బైక్​ను అక్కడే పడేసి వెళ్లిపోయాం.' - ననుబోతుల లింగయ్య, వాహన దారుడు

forest officers on tiger: ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఈరోజు ఉదయం నాలుగు బృందాలుగా విడిపోయి అడవిలో పులి కోసం వెతకటం ప్రారంభించారు. ముందుగా సంగెం కాలువ సమీపంలో పులి పాద ముద్రలను సేకరించారు. పాకాల సరస్సుకు ముందు భాగంలో అడవిని ఆనుకొని ఉన్న పొలములో పులి పాదముద్రలు కనిపించాయని అధికారులకు ఓ రైతు సమాచారం అందించారు.

DFO on tiger: రైతు ఇచ్చిన సమాచారం మేరకు డీఎఫ్ఓ అపర్ణ సోహెల్ తన బృందంతో కలిసి పులి ఆనవాళ్లు ఉన్న చోటికి చేరుకుని పరిశీలించారు. పెద్దపులి ఆహారం కోసమే రోడ్డుమీదకు వచ్చిందని పలువురు చెబుతున్నారు. పాకాల అడవిలో పెద్దపులి ప్రత్యక్షం కావడంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు.

Pakala bio diversity park: అయితే ఖానాపూర్ మండలం పాకాల అభయారణ్యం ఒకప్పుడు వన్యప్రాణులకి సంరక్షణ కేంద్రంగా ఉండేది. ఈ అభయారణ్యం ఖానాపూర్, గూడూరు, కొత్తగూడ, మహబూబాబాద్ వరకు వ్యాపించి ఉంది. ఇక్కడ జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు తమ సంతతిని పెంచుకున్నాయి. గత కొద్ది రోజులుగా మహబూబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ ప్రాంతాలలో పులి సంచరిస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి.

పులి వచ్చినట్లు సమాచారం ఉంది: అపర్ణ సోహెల్, డీఎఫ్ఓ

'నర్సంపేట్ రేంజ్​లో అశోక్ నగర్, పాకాల అటవీ ప్రాంతాల్లో పులి వచ్చినట్లు సమాచారం ఉంది. పులి అడుగులు గుర్తుల కోసం వెతుకుతున్నాం. గుర్తులు దొరికితే అది ప్రయాణించిన మార్గం సులువుగా తెలుస్తుంది. పెద్దపులి సంచరించే ప్రదేశాన్ని గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తాం. అప్పటివరకు అడివిలోకి పశు, గొర్ల కాపరులు వెళ్లకపోవడమే మంచిది. పులి సంచారం పట్ల జాగ్రత్తగా ఉండండి. పులి కదలికలను మేం అంచనా వేస్తున్నాం. ఇందుకోసం 4 ప్రత్యేక బృందాలను నియమించాం. సమాచారం తెలిస్తే మేం తెలియజేస్తాం.'

- అపర్ణ సోహెల్, డీఎఫ్ఓ

ABOUT THE AUTHOR

...view details