తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారీ భూమిలో రాత్రికిరాత్రే నిర్మాణాలు - Occupied government land in WARANGAL RURAL DISTRICT

అన్ని అనుమతులు తీసుకుని ఓ ఇల్లు కట్టుకుంటే దానికి కరెంటు కావాలన్నా.. మంచినీటి కనెక్షను రావాలన్నా పదిసార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి! వరంగల్‌ జిల్లాలో మాత్రం అదేం మాయో కాని ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి రాత్రికి రాత్రి కొందరు పిచ్చుకగూళ్ల లాంటి ఇళ్లు కట్టేసుకుంటే.. అధికారులు పోటీపడి మరీ సకల సదుపాయాలూ కల్పించేశారు.. ఒక విభాగం ఆగమేఘాల మీద ఇంటింటికీ మిషన్‌ భగీరథ పైపులైన్లు వేసేయగా.. మరో విభాగం సిబ్బంది ఇంటి నంబర్లు ఇచ్చిపోయారు. మేమేం ‘తక్కువ తిన్నామా?’ అంటూ ఇంకో శాఖవారు వచ్చి ఇంటింటికీ మీటర్లు బిగించి అర్జెంటుగా కరెంటు కనెక్షన్లు ఇచ్చేసి కాలనీని వెలిగించిపోయారు.

Occupied government land , WARANGAL  RURAL DISTRICT
సర్కారీ భూమిలో రాత్రికిరాత్రే నిర్మాణాలు

By

Published : Mar 30, 2021, 7:55 AM IST

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలో చోటుచేసుకున్న మాయ ఇది. ఇక్కడి గొర్రెకుంట సమీపంలో మల్లికుంట చెరువు శిఖం భూముల్లోని సర్వే నంబరు 95లో చాన్నాళ్లుగా పేదలు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. సుమారు 550 కుటుంబాల వరకు ఉంటున్నాయి. ఈ కాలనీ పేరు గరీబ్‌నగర్‌. మల్లికుంటకు ఆయకట్టు లేకపోవడంతో చెరువు శిఖం భూములను అయాన్‌ భూములుగా మార్చి ప్రభుత్వం ఈ బస్తీ వాళ్లకు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.

సరిగ్గా ఇక్కడే ఓ భూమాయకు తెరలేచింది. ఈ సర్వే నంబరు 95కు పక్కనే సర్వే నంబరు 93లో 1.26 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ స్థలం ఖాళీగా ఉంది. వరంగల్‌ నగర శివారైన ఈ ప్రాంతంలో ఎకరం భూమి సుమారు రూ.3 కోట్ల ధర పలుకుతోంది. దీంతో ఓ ప్రజాప్రతినిధి అనుచరులు ఆ స్థలంపై కన్నేశారు.

ఎలాగూ త్వరలో పేదలకు పట్టాలివ్వనున్నారు కాబట్టి పనిలో పనిగా ఈ 1.26 ఎకరాల సర్కారు భూమిని కూడా కాజేసి పట్టాలు పొందేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలుంటే జీవో నంబరు 58, 59 ప్రకారం రెగ్యులరైజ్‌ చేసుకునే వెసులుబాటు ఉందని తెలుసుకొని ఖాళీ స్థలంలో 20 రోజుల క్రితం రాత్రికి రాత్రి ఓ చిన్నపాటి కాలనీ కట్టేశారు. ఇన్‌స్టంట్‌ విధానంలో చిన్నచిన్న ఇళ్లను నాలుగు గంటల వ్యవధిలో ఓ స్థానిక నేత అండతో కట్టేసి కబ్జా చేశారు. ఆ ప్రజాప్రతినిధి తన అనుచరులకు స్థలాలను కట్టబెట్టేందుకు పక్కా వ్యూహంతో పైస్థాయి నుంచి పైరవీ చేశారు. ప్రభుత్వ స్థలంలో పేదలున్నారని, వారి పేరిట క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేయించారు. సాధారణంగా ఇంటి నంబరు రావాలన్నా, కరెంటు మీటరు పొందాలన్నా సామాన్యులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఈ కాలనీకి ప్రజాప్రతినిధి అండ ఉండడంతో అన్ని శాఖల అధికారులు సహకరించారు. లింకు డాక్యుమెంట్లు లేకున్నా ఇంటి నంబర్లు ఇచ్చేశారు. ఆ వెంటనే కరెంటు మీటర్లు బిగించేశారు. మనుషులు ఇళ్లలో నివాసం ఉండకున్నా ఠంచనుగా ఇంటింటికీ భగీరథ పైపులైన్లు కూడా వేసేశారు. పనులన్నీ చకచకా జరిగిపోయాయి. రేపో మాపో పట్టాలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేపడుతున్నారు. త్వరలో గరీబ్‌నగర్‌వాసులకు పట్టాలిచ్చే సమయానికి, సర్వే నంబరు 93లో పాగా వేసిన వారికి కూడా పట్టాలిచ్చేలా పావులు కదుపుతున్నారు.

సర్వే నడుస్తోంది

సర్వే నంబరు 93 ప్రభుత్వ అసైన్డ్‌ భూమి. ఇక్కడ ప్రస్తుతం సర్వే చేస్తున్నాం. ఎంతమంది అర్హులు ఉన్నారో పరిశీలిస్తున్నాం. నివేదికను త్వరలో కలెక్టరుకు అందజేస్తాం. - మహేందర్‌జీ, ఆర్డీవో, వరంగల్‌ రూరల్‌

ABOUT THE AUTHOR

...view details