Harish Rao on Warangal Super Specialty Hospital: చారిత్రక నగరిగా ఖ్యాతి పొందిన వరంగల్‌లో అధునాతనమైన వైద్య సేవల కోసం నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎంజీఎం ఆసుపత్రి రోగులకు సరిపోకపోవడంతో.. కేంద్ర కారాగారాన్ని తొలగించి.. ఆ ప్రాంతంలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలందుతూ.. వరంగల్ నగరం ఓ హెల్త్ సిటీగా నిలవాలన్న ఆకాంక్షతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1,200 కోట్లకు పైగా వ్యయంతో.. ఈ ఆసుపత్రి నిర్మాణానికి సంకల్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను స్ఫూర్తిగా తీసుకుని... వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దసరా కల్లా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను, నిర్మాణ ఏజెన్సీని కోరినట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని... అందులో భాగంగానే 24 అంతస్తులతో అధునాతన ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన... అధికారులకు పలు సూచనలు చేశారు. అవయవ మార్పిడి సంబంధించి శస్త్రచికిత్సలూ హైదరాబాద్ కు వెళ్లనవసరం లేకుండా ఇక్కడే జరుగుతాయని తెలిపారు.
దేశానికే ఇది మోడల్ ఆసుపత్రిగా నిలబోతోంది : వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దేందుకు... ముఖ్యమంత్రి కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరంగల్‌లో 24 అంతస్తుల్లో నిర్మిస్తున్న... హెల్త్ సిటీ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. దేశానికే ఇది మోడల్ ఆసుపత్రిగా నిలబోతోందని... కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. కొత్తగా నిర్మించిన... ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు చేపట్టబోతున్నామని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ హయాంలో... వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే 8 వైద్య కళాశాలలు నిర్మించామన్నారు.